ములుగు ,ప్రజాతంత్ర, జులై 6 : పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక నిండు గర్బిణి దట్టమైన అడవిలో కనీసం రోడ్డు మార్గం కూడా లేని, వాగులు, దాటుకుని చీకట్లో ఓపికతో వస్తుండగా 108 అంబులెన్స్ (108 ambulance) వచ్చి వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవిలో కోయగుంపునకు చెందిన 26 ఏళ్ల సోలం భోజ్జె మొదటి కానుపు పురిటి నొప్పులు రావడంతో 108 కి కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో 108 ఏటూరునాగారం సిబ్బంది ఈఎంటి శివలింగం ప్రసాద్, పైలట్ కోటి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని గర్భిణిని రోడ్డు మార్గం వరకు తీసుకురావడానికి చేయూతనిచ్చారు. భోజ్జె ఆరోగ్య పరిస్థితిని పరీశీలించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో వీరాపురం ఊరి చివరిలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవరించిన ఈఎంటి శివలింగంప్రసాద్ సుఖ ప్రసవం చేశాడు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం తల్లి బిడ్డలకు కావాల్సిన మందులు అందించి, మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. బయట ప్రపంచానికి దూరంలో ఉన్న గొత్తికోయ కుటుంబానికి భారోసాగా నిలిచి సుఖ ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బందికి భోజ్జె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
అంబులెన్స్ లోనే పురుడు పోసిన ఆపద్బాంధవులు




