ప్రపంచ దార్శనికుడు డాక్టర్ బి.ర్. అంబేడ్కర్

“కులం అనే మానసిక జాడ్యం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో..స్వయంగా అనుభవించిన  భీమ్ రావు అంబేడ్కర్ కులాన్ని కూకటి వీళ్ళతో పెకిలించి వేసినప్పుడే మానవ అభివృద్ధి చెందుతుందనీ అనేక కుల నిర్మూలన పోరాటాలు నిర్వహించారు. మహిళలకు సమాన హక్కులు సాధన కోసం తన న్యాయశాఖ మంత్రి పదవినీ సైతం త్యజించన మహిళా పక్షపాతిగా నిలిచారు..”
దండు మోహన్
న్యాయవాది,
హన్మకొండ జిల్లా
సెల్ :9030774485

యావత్ ప్రపంచానికి ఏప్రిల్ 14 ఒక పండుగ రోజు. ప్రపంచం గర్వించే గొప్ప మానవతావాది జన్మించిన రోజు. 2016 ఏప్రిల్ 14న ఐక్యరాజ్య సమితి సమానత్వ దినోత్సవంగా ప్రకటించిన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే… కులం, మతం, వర్గం, వర్ణం, తదితర అసమానతల నిర్మూలనకు బీజం పడిన రోజు. అంటారని తనం, మూఢత్వం, అణచివేత, వివక్షత, బానిసత్వం కొనసాగుతుందో అక్కడ  విముక్తి మార్గాన్ని, ఒక దిశ, నిర్దేశాన్ని, చూపించే విశ్వ విజ్ఞాని పుట్టిన రోజు. ఈ భూగోళంపై ఏర్పడిన ప్రతీ జీవి, నిర్జీవికి, చెట్టుకు, పుట్టకు హక్కుల ప్రదాత జన్మించిన రోజు. మానవత్వాన్ని, ప్రకృతి సమతుల్యతను, పర్యావరణాన్ని కాపాడిన గొప్ప పర్యావరణ పరిరక్షకుడు పుట్టిన రోజు. ఈ భూమిపై పుట్టిన ప్రతీ మనిషి తమ సాటి జీవరాశుల పట్ల, పరిసరాల పట్ల అనుసరించాల్సిన  విధానాలను, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ…ఆటవిక జీవితం నుంచి సంపూర్ణ నాగరికుడిగా, మనిషి, మానవతావాదిగా సంస్కరించడానికి అవకాశాలు చూపించిన మార్గ దర్శకుడు పుట్టిన రోజు.

    దోపిడీ కులాలచే సృష్టించబడిన కృత్రిమ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అంటారని కులంలో ఒక వేగుచుక్క పుట్టిన రోజు. అడుగడుగున అనేక అవమానాలను అధిగమించి,కారు చీకట్లను చీల్చుకుని  అణగారిన వర్గాల జీవితాలకు వెలుగులు ప్రసాదిస్తున్న జ్ఞాన సూర్యుడు అవతరించిన రోజు. తన నలుగురి పిల్లలు ప్రాణాలు కోల్పోయిన కుంగిపోకుండా, పీడిత వర్గాల సంక్షేమం కోసం సామాజిక ఉద్యమాలు నడిపిన గొప్ప పోరాట యోధుడు పుట్టిన రోజు. సుమారుగా 60 దేశాల రాజ్యాంగలను చదివి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ రూప శిల్పి పుట్టిన రోజు. ఆ మహానుభావుడే…1891 ఏప్రిల్ 14న ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని “మహూ” అనే గ్రామంలో రామ్‌జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించిన నేటి యుగపురుషుడు డాక్టర్ భీమ్ రావు అంబేడ్కర్. అందుకే…ఏప్రిల్ 14కు  ఈ విశేషం.
      ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, మౌరీషన్, వియత్నాం, సౌత్ కొరియా, హంగేరి, దక్షిణాఫ్రికా, అజార్ బైజాన్, స్విట్జర్లాండ్, ఉబ్బెకిస్తాన్ తదితర దేశాల్లో డాక్టర్ బి.ర్. అంబేడ్కర్  విగ్రహాలు ఏర్పాటు చేసుకుని, ఆయన స్వియానుభవ జ్ఞానం ద్వారా చూపిన మార్గాన్ని స్పూర్తిగా తీసుకుని, ఆయన వర్థంతి, జయంతి వేడుకలు    నిర్వహిస్తున్నారు. ఒక్క భారత దేశంలోనే సుమారు లక్షకు పైగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆయన వర్థంతి, జయంతి వేడుకలు వాడవాడలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచంలోనే ఎత్తైన  అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. డాక్టర్ భీమ్ రావు అంబేడ్కర్ జీవితంలో విద్య, పోరాటం, రాజ్యాంగ నిర్మాణం కీలకమైన అంశాలుగా నిలిచాయి.
డాక్టర్ అంబేద్కర్ విద్యాభ్యాసం అసాధారణమైనది.తీవ్ర వివక్ష మధ్య కూడా ఆయన అత్యున్నత విద్యను సాధించారు. మొదట బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ కాలేజీ  లో చదివారు.తరువాత అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ  లో ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇంగ్లాండ్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందారు.అలాగే బారిస్టర్‌గా కూడా శిక్షణ పొందారు. డాక్టర్ అంబేడ్కర్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, ప్రపంచ స్థాయి విద్యను సాధించడమే కాకుండా, ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరూ సాధించలేని 32 డిగ్రీలు పొందిన  ఘనత డాక్టర్ బి.ర్.అంబేడ్కర్ కే దక్కింది. ఆ కాలంలో తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఇంత ఉన్నత విద్య పొందడం చాలా అరుదు.
అంబేడ్కర్ జీవితమంతా సమానత్వం కోసం పోరాటమే. వాటిలో కొన్ని ముఖ్య ఉద్యమాలు
1927 మహాడ్ సత్యాగ్రహం: తక్కువ కులాల వారికి పబ్లిక్ నీటి వనరులు వినియోగించే హక్కు కోసం పోరాటం, కాళారాం దేవాలయ ప్రవేశం ఉద్యమం, దేవాలయాల్లోకి ప్రవేశం కోసం పోరాటం, చావ్దార్ ట్యాంక్ ఉద్యమం, నీటి హక్కుల కోసం మహాద చెరువు ఉద్యమం, అంటరానితనం, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్య, స్వాభిమానాన్ని ప్రోత్సహించారు. “బోధించు! సమీకరించి!! పోరాడు!!” అనే నినాదాన్ని ఇచ్చారు.1920లో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం ప్రారంబించి, ఆ పోరాన్ని విస్తృత పరిచేందుకు “మూక నాయక్” అనే పత్రికను ప్రారంబించారు.
రాజ్యాంగ నిర్మాణం:
         రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ర్.అంబేడ్కర్  కీలక పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ రచనా సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. విభిన్నమైన కుల, మతాలు, ప్రాంతాలుగా ఉన్న  భారత అసమానతల సామాజిక, ఆర్థిక వ్యవస్థలను భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా భారత ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారు. అణగారిన వర్గాల రక్షణ, మౌలిక హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రతత్వం, లౌకికత్వం, సామాజిక న్యాయం అనే విలువలతో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయనను “భారత రాజ్యాంగ పితామహుడు” అని పిలుస్తారు.
     వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న మనువాద హిందూ నిచ్చెన మెట్ల  కుల వ్యవస్థ ద్వార ఈ దేశ మూల వాసులను శూద్రులుగా పరిగణించి, అణచివేయడాన్ని  నిరసనగా ఆయన బౌద్ధ మతం స్వీకరించారు. *నేను హిందువుగా పుట్టడం నా చేతిలో లేదు, సాటి మనిషినీ మనిషిగా చూడని హిందూ మతంలో కొనసాగడం నాకు ఇష్టం లేదానిచెప్పారు. 14 అక్టోబర్ 1956లో మహారాష్ట్ర, నాగపూర్ లో సుమారు ఆరు లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతంలోకి మారారు.     దేశంలో ఏ దిక్కు చూసిన కులం అనే మహమ్మారి వెంటాడుతుందని, కుల నిర్మూలన చేయకుండా అభివృద్ధి జరగదన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్న వ్యాఖ్యలు నేడు అక్షర సత్యాలుగా నిలిచాయి. కులం అనేది ఒక సామాజిక సమస్యగా దేశ అభివృద్ధికి అడ్డుగోడగ నిలుస్తుంది అన్నారు.
కులం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినప్పుడు ప్రపంచ సమస్యగా మారుతోంది అన్నారు. నేడు దేశ, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు వారివారి కులసంఘాలు పెట్టుకుని కుల జాడ్యంను పెంచిపోదించడం ఇందుకు నిదర్శనం. “అగ్రరాజ్యమైన అమెరికాలో కుల వివక్షతను స్పష్టంగా నిషేధిస్తూ, చట్టం చేసిన తొలి నగరంగా 2023 ఫిబ్రవరి 21న సియాటెల్ నిలిచింది.” కులం అనే మానసిక జాడ్యం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో..స్వయంగా అనుభవించిన  భీమ్ రావు అంబేడ్కర్ కులాన్ని కూకటి వీళ్ళతో పెకిలించి వేసినప్పుడే మానవ అభివృద్ధి చెందుతుందనీ అనేక కుల నిర్మూలన పోరాటాలు నిర్వహించారు. మహిళలకు సమాన హక్కులు సాధన కోసం తన న్యాయశాఖ మంత్రి పదవినీ సైతం త్యజించన మహిళా పక్షపాతిగా నిలిచారు. అణగారిన వర్గాల కోసం పోరాడి, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు. ఆయన జీవితాంతం సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి, త్యాగం ఒక గొప్ప ప్రేరణగా చరిత్రలో నిలిచింది. కాబట్టే డాక్టర్ భీమ్ రావు అంబేడ్కర్ ప్రపంచ దార్శనికుడయ్యారు.
                 దండు మోహన్
                    న్యాయవాది,
                          హన్మకొండ జిల్లా
               సెల్ :9030774485

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *