గన్‌మన్ కాల్పుల్లో జాగృతి కార్యకర్తకు గాయాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 134: మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆ కార్యాలయంపై ఆదివారం దాడి చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోనే తీన్మార్ మల్లన్న ఉన్నారు. కవిత బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టడంతో ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. జాగృతి సభ్యులు బయటకు వెళ్లకపోతే కాల్పులు జరుపుతామని మల్లన్న గన్‌మన్ హెచ్చరించాడు. అయినా వారు కార్యాలయం నుంచి వెళ్లకపోవడంతో గన్‌మన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జాగృతి సభ్యుడు సాయి అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ఆయన చేతి నుంచి బుల్లెట్ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఎక్కువగా రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.





