– సీజేఐ బెంచ్‌పైకి షూ విసిరిన న్యాయవాది
– దాడికి కారకుడు రాకేష్ కిషోర్‌గా గుర్తింపు
– అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
– ఇవి నన్ను ప్రభావితం చేయలేవు: జస్టిస్ గవాయ్
– దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు: సిఎం రేవంత్
న్యూదిల్లీ, అక్టోబర్ 6(ఆర్‌ఎన్‌ఎ): సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన సంఘటన పెను కలకలం రేపింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక న్యాయవాది బూటు విసరడంతో అక్కడ వున్నవారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. సుప్రీంకోర్టు చరిత్రలో ప్రధాన న్యాయమూర్తిపై ఈవిధంగా దాడి జరగడం ఇదే ప్రథమం. సంఘటన ను విపక్షనేతలు, పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి హాలులో ఒక కేసు విచారణ జరుగుతుండగా ఒక న్యాయవాది ఆగ్రహంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనంపై బూటు విసిరాడు. తక్షణమే కోర్టు భద్రతా సిబ్బంది స్పందించి ఆ న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాకేష్ కిషోర్‌గా గుర్తించారు. సనాతన ధర్మంపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కోర్టు హాలులో బూటు విసిరే సమయంలో సదరు న్యాయవాది సనాతనాన్ని అవమానించడాన్ని భారత్ సహించదు అంటూ గట్టిగా నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అతడు విసిరిన బూటు బెంచ్‌కు తగలకుండా కిందపడింది. సంఘటనపై ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ ఇటువంటివి తనను ఏవిధంగానూ ప్రభావితం చేయలేవు.. న్యాయవాదులంతా ఎవరి పనులు వారు చేసుకోండి.. దృష్టిని మళ్లించవద్దు అని సూచించారు. కాగా, సుప్రీంకోర్టు భద్రతా విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. రాజకీయ నాయకులు, ప్రముఖులు స్పందిస్తూ సీజేఐపై జరిగిన దాడిని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. చీఫ్ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’ఎక్స్‘ వేదికగా తెలిపారు. తాను చీఫ్ జస్టిస్‌తో మాట్లాడానన్నారు. ‘సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఉదయం జరిగిన సంఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది.. మన సమాజంలో ఇలాంటి అవమానకరమైన చర్యలకు చోటు లేదు.. ఇది పూర్తిగా ఖండిరచదగినది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలపై జరుగుతున్న ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ దాడికి కారణమైన న్యాయవాది సనాతన ధర్మం అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో విపక్షాలు దీన్ని రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలతో ముడిపెట్టే ప్రయత్నాలంటూ ఖండించాయి. మతపరమైన లేదా రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం సరికాదనిపేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకు భద్రత పెంచాలని, ఇటువంటి విచారకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు : సీఎం రేవంత్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దేశ న్యాయవ్యవస్థలోని అత్యున్నత అధికారిపై దాడి చేసి బెదిరించడానికి జరిగిన దుర్మార్గపు ప్రయత్నాన్ని తాను మాటల్లో ఖండించలేనన్నారు. ఇది దేశ చరిత్రలో చీకటి రోజు అని అభివర్ణించారు. ఇటువంటి పిరికి దాడులకు తాను భయపడబోనని ధైర్యంగా ప్రకటించిన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ కి దేశ పౌరులతో కలిసి తాను సంఘీభావం ప్రకటిస్తున్నట్లు రాసుకొచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




