ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ
కాంగ్రెస్‌కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం
బిఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు
రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్నదాతల అందరి ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు మొత్తం జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో సోమవారం ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీటనొక్కగానే రైతు ఖాతాల్లోకి టింగ్‌టింగ్‌ మంటూ రైతు భరోసా నిధులు జమవుతాయని, రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం అని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని సాగు యోగ్యమైన, రైతన్నలు సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తే ఆ మొత్తం ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ అవుతాయి.. ఎలాంటి లిమిట్‌ లేదు అన్నారు. రాష్ట్రంలో సాగులో ఉన్న 1.49 కోట్ల పైబడి ఎకరాలకు ఎకరాకు 12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయిన్నారు. భూమి లేని నిరుపేదలు వారు వ్యవసాయ కూలీలుగా ఉంటూ రైతుల పక్షాన నిలబడుతున్న పేదలకు కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 చొప్పున ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూపాయి, రూపాయి పోగుచేసి రైతులు, రాష్ట్ర ప్రజల పక్షాన సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. రైతుల కోసం ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 70 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో మొత్తం 3.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇలా ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతే ఇక మాకు పుట్టగతులు ఉండవని పదేళ్లు పాలించిన వారు ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం రాష్ట్ర ప్రజలు గుర్తించాలి అన్నారు. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఈ ప్రభుత్వం నిటారుగా నిలబడిరది అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు అరచేతిలో పెట్టుకొని ఆశీర్వదించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం విక్రమార్క అన్నారు. రైతులకు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఉచిత కరెంటు, రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, మద్దతు ధరతోపాటు సన్నధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్‌ చెల్లిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎప్పుడైనా పంట నష్టం జరిగితే లెక్క గట్టి రైతుల ఖాతాల్లో జమ చేశ, కానీ 10 సంవత్సరాలు పరిపాలించిన నేతలు ఆఆలోచన చేయలేదని డిప్యూటీ సీఎం విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పంట నష్టం కింద 260 కోట్లు విడుదల చేశాం, రైతుల ఇన్సూరెన్స్‌ కోసం 2,181 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 11 వేల కోట్లు ఖర్చు చేసినట్టు భట్టి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *