– హాజరైన విపక్ష నేత కేసీఆర్
– స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు
– ఆయనకు నమస్కరించి ఆరోగ్యంపై సీఎం రేవంత్ వాకబు
– కేసీఆర్‌ను పలకరించిన మంత్రులు
– మాజీ సర్పంచ్‌ల అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, పజ్రాతంత్ర, డిసెంబర్ 29: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. ఈ సమావేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మిగతా సభ్యులందరికంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి తన చైర్‌లో కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి బాగున్నారా అని పలకరించారు. బాగున్నాను అంటూ కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తర్వాత మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ ఆయనను పలకరించి అభివాదం చేశారు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల్లో సంతాప తీర్మానాల అనంతరం మాజీ మంత్రి హరీష్‌రావుతో కేసీఆర్ సభ నుంచి బయటకు వచ్చి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. తొలిరోజు సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి శాసనసభ, మండలి ఎన్నిరోజులపాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీలో ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్‌ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్‌టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ తదితర అంశాలకు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారపక్షం అప్రమత్తమైనట్టు తెలిసింది. సాగునీటిపై షార్ట్ డిస్కషన్‌ను అనుమతించి సాధ్యమైనంత వరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరణతోనే నెట్టుకు రావాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలను రెండుమూడు రోజుల్లోనే ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా జ్యుడీషియరీ కేడర్ నుంచి వచ్చిన అధికారి ఆర్.తిరుపతి అసెంబ్లీ కార్యదర్శి హోదాలో శాసనసభను నడిపించబోవడం విశేషం. ఇప్పటివరకు అసెంబ్లీ కేడర్ అధికారులే ఈ బాధ్యత నిర్వర్తించేవారు. మరోవైపు పెండిరగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్‌లు ప్రయత్నిస్తారనే సమాచారంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అలాగే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





