“ఆశా” కార్యకర్తలను ఆదుకోవాలి

రాష్ట్ర  ఆరోగ్య ముఖచిత్రంలో ‘ఆశా’ (ASHA – Accredited Social Health Activists) కార్యకర్తలు ఒక విడదీయలేని భాగం. గ్రామాల్లో గర్భిణి నమోదు మొదలుకొని, టీకాలు వేయించడం, అంటువ్యాధుల నియంత్రణ వరకు వీరు అందించే సేవలు అమూల్యం. అయితే, వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ 28 వేల  మహిళా కార్యకర్తల జీవితాల్లో మాత్రం ‘ఆశ’ మృగ్యమవుతోంది. ఎన్నికల వేళ ఆకాశమంత హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వొచ్చాక వారిని విస్మరించడం నేడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ పల్లెల్లో తెల్లవారుజామునే తలుపు తట్టే ఆశా కార్యకర్త కేవలం ఒక ఆరోగ్య కార్యకర్త మాత్రమే కాదు; ఆమె ఒక ప్రాణ రక్షణ కవచం. మారుమూల గిరిజన తండాల నుండి హైదరాబాద్‌లోని ఇరుకైన మురికివాడల వరకు ప్రతి గడపకూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను చేరవేసే వారధి ఆమె. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 28వేల  మంది ఆశా వర్కర్ల స్థితి నేడు ‘దీపం కింద చీకటి’లా మారింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఆలస్యం  వారిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రకటించింది. ముఖ్యంగా: ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ. 18 వేలు  పెంచుతామని హామీ ఇచ్చారు. పని ఒత్తిడిని తగ్గించి, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామనీ, ప్రమాద బీమా మరియు ఇతర సంక్షేమ ఫలాలను అందిస్తామని వాగ్దానం చేశారు. ప్రస్తుతం వీరు అందుకుంటున్న రూ. 9,900 వేతనం ఏ మూలకూ సరిపోవడం లేదు. ధరల పెరుగుదల, కుటుంబ పోషణ భారంతో సతమతమవుతున్న ఆశా కార్యకర్తలు, కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే తమ బతుకులు మారుతాయని గంపెడు ఆశతో వోటేశారు. కానీ, ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా.. ‘పెంచిన వేతనం’ ఫైలు సచివాలయపు గోడల మధ్యే నలుగుతోంది.

ఆశా వర్కర్ల పని వేళలకు పరిమితి లేదు. అర్ధరాత్రి గర్భిణికి నొప్పులు వొచ్చినా, గ్రామంలో ఎవరికి ఏ ఆపద వొచ్చినా వారే ముందుండాలి. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన ఈ “ఆరోగ్య సైనికుల” పట్ల ప్రభుత్వం కనీస కనికరం చూపకపోవడం శోచనీయం.సాధారణ ఆరోగ్య సేవలకే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సర్వేకూ వీరినే వాడుకుంటున్నారు. డిజిటల్ హెల్త్ కార్డుల నుండి ఇంటింటి సర్వేల వరకు అదనపు భారం వేస్తున్నా, దానికి తగిన ప్రతిఫలం అందడం లేదు. వేతనాలే కాకుండా, వీరికి అందాల్సిన ఇతర ఇన్సెంటివ్‌లు (ప్రోత్సాహకాలు) నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే వీరికి కనీసం కూర్చోవడానికి సబ్-సెంటర్లలో సరైన వసతులు లేవు.

హామీల అమలు కోరుతూ ఆశా వర్కర్లు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసనలు, జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. “అధికారం రాకముందు అక్కాచెల్లెమ్మలని పిలిచిన వారు, ఇప్పుడు కనీసం చర్చలకు కూడా పిలవడం లేదని” వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాకులు చూపుతూ కాలయాపన చేయడం సమంజసం కాదు. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రభుత్వం, ప్రజల ప్రాణాలను కాపాడే కార్యకర్తల కోసం నెలకు కొన్ని కోట్లు కేటాయించలేకపోవడం ప్రాధాన్యతల వైఫల్యమే అవుతుంది.

ఆరోగ్యవంతమైన తెలంగాణ కేవలం పెద్ద పెద్ద హాస్పిటల్స్  వల్ల మాత్రమే సాధ్యం కాదు; అది క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్ల నైపుణ్యం మరియు అంకితభావం మీద ఆధారపడి ఉంటుంది. వారి కడుపు కొట్టి ఆరోగ్యాన్ని కాపాడాలనుకోవడం అవివేకం. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి:.హామీ ఇచ్చిన విధంగా రూ. 18వేల  వేతనాన్ని జీఓ  రూపంలో విడుదల చేయాలి. బకాయి ఉన్న ప్రోత్సాహకాలను వెంటనే చెల్లించాలి.వారికి సామాజిక భద్రత (ESI, PF) కల్పించే దిశగా అడుగులు వేయాలి.
మాట తప్పడం రాజకీయాల్లో సహజం కావొచ్చు, కానీ ప్రాణాలతో ముడిపడి ఉన్న వ్యవస్థలో పనిచేసే వారి పట్ల అశ్రద్ధ చూపడం సమాజానికే ప్రమాదం. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *