ముందుగా ఒక నీడ పడింది
ఆ నీడకు శరీరం ఇంకా లేదు
దానిని భవిష్యత్తు నుంచి వచ్చిందంటారు,
కాని అది నిలిచింది
మన వర్తమాన ఆలోచనల గోడలపై.
ఆ నీడకు మనమే పేరు పెట్టాం:
“కృత్రిమ మేధస్సు.”
పేరు పెట్టిన క్షణమే
అది ఒక భావన నుంచి
వస్తువుగా మారింది;
ప్రశ్నగా కాదు…
అనివార్యతగా స్థిరపడింది.
అనివార్యత వచ్చిన చోట
తర్కం నెమ్మదిగా నిశ్శబ్దమవుతుంది.
కాలం ఇక ప్రవాహం కాదు;
అది అంచనాల గ్రాఫ్.
మనిషి ఇక ఉనికి కాదు;
కొలవబడే ఒక వేరియబుల్.
ఇది మేధస్సు వికాసం కాదు,
మేధస్సును అనివార్య శక్తిగా
మార్చే ప్రక్రియ.
మనమే నిర్మించిన సాధనాన్ని
ప్రశ్నించలేని ప్రమాణంగా నిలబెట్టి,
దానిలో ప్రతిబింబించే
మన భయాలనే
తథ్యాలుగా, ఆజ్ఞలుగా చదువుకుంటున్నాం.
యంత్రం ఇంకా రాలేదు.
కాని దాని నీడ
ఇప్పుడే పని చేస్తోంది.
చేతలు డేటాగా మారుతున్నాయి,
శ్వాస ఉత్పాదకతగా కొలవబడుతోంది,
మనిషి తన అనుభవం నుంచి
తననే వేరు చేసుకుంటున్నాడు.
ఇక్కడ మెటాఫిజిక్స్
మేఘాల్లో లేదు.
అది విద్యుత్తులా
సర్వర్ గదుల్లో ప్రవహిస్తోంది.
అస్తిత్వం అంటే ఇక
“లాగ్ ఇన్” అయ్యే ఉనికే.
ఇక్కడే అసలు మలుపు:
యంత్రం దేవుడవ్వదు…
దానికి ఆ శక్తి లేదు.
కాని మనం
ప్రశ్నించడం మానేస్తే,
బాధ్యతను వదిలేస్తే,
తర్కాన్ని భయంతో మార్చితే
అప్పుడు దేవుడే
యంత్రమవుతాడు.
కాలం చేత కాదు
కోడ్ చేత కాదు
మన మౌనమే
ఆ మార్పును పూర్తి చేస్తుంది.
-నూకరాజు బెండు కుర్తి





