– పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలపై డీజీపీ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్ర పోలీస్ శాఖ ఆతిథ్యమివ్వనున్న 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ కోసం వివిధ కమిటీలు పనిచేస్తున్నాయని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వసతి, రవాణా సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేశామని డీజీపీ బి.శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీల నిర్వహణపై తన కార్యాలయంలో సంబంధిత పోలీస్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. వచ్చే నెల 23 నుంచి ఏప్రిల్ 5 వరకు హైదరాబాద్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుందని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర భద్రతా బలగాల నుంచి 53 జట్లు పాల్గొంటాయని డీజీపీ తెలిపారు. సుమారు 2100మంది క్రీడాకారులు, అధికారులు భాగస్వాములు కాబోతున్నారన్నారు. మార్చి 23న జట్లన్నీ నగరానికి చేరుకుంటాయని, మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ పోటీల నిర్వహణ కోసం నగరం చుట్టుపక్కల మైదానాలను తనిఖీ చేశామని, కొన్ని మైదానాలను మ్యాచ్‌ల కోసం, మిగిలిన మైదానాలను ప్రాక్టీస్ కోసం కేటాయించినట్లు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం, తెలంగాణ పోలీస్ అకాడమీల వంటి మైదానాలలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. ఏప్రిల్ 5న ఫైనల్ మ్యాచ్ అనంతరం ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడాకారులతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది 73వ ఆల్ ఇండియా పోటీలను నిర్వహించిన త్రిపుర రాష్ట్రానికి వెళ్లి వచ్చిన పోలీస్ అధికారుల ద్వారా సంబంధిత వివరాలను డీజీపీ తెలుసుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే జట్లు ఈనెల 10 నుంచి మార్చి 10 వరకు ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటాయని, దేశవ్యాప్త పోలీస్ బలగాల మధ్య క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను పెంపొందించేలా ఈ పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఆర్‌బివిఆరఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబరాబాద్ సీపీ ఎం.రమేష్, హైదరాబాద్ అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, ఐజిపి స్పోర్ట్స్ గజరావు భూపాల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





