మేడారం జాత‌రకు  విస్తృత ఏర్పాట్లు

యుద్ద‌ప్రాతిప‌దిక‌న అభివృద్ది ప‌నులు :   మంత్రి పొంగులేటి

ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని  మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేప‌ట్టామ‌ని వీటిని నిర్ధేశించిన గ‌డువులోగా పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మేడారం జాత‌ర నేప‌ధ్యంలో శుక్ర‌వారం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   స‌హ‌చ‌ర మంత్రులు రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ ( సీత‌క్క‌), దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, సీత‌క్క‌,  ఎంపీ బలరాం నాయక్ త‌దిత‌రుల‌తో క‌లిసి వివిధ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఆదివాసీ సంప్ర‌దాయాల‌కు పెద్ద పీట వేస్తూ ఇల‌వేల్పులు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు  శ్రీ‌కారం చుట్టామ‌ని తెలిపారు. రోడ్ల నిర్మాణ ప‌నులు, డివైడ‌ర్లు, ప్లాంటేష‌న్ త‌దిత‌ర ప‌నులు పూర్తి కావడానికి 24 గంట‌లు నిరంత‌రం ప‌నిచేయాల‌న్నారు. పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌ను దృష్టిలో పెట్టుకొని గ‌ద్దెల వ‌ద్ద భ‌క్తుల కెపాసిటీ 3వేల నుంచి 10వేల‌కు పెంచుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌యాణంలో భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా మేడారానికి వ‌చ్చే ప్ర‌ధాన ర‌హ‌దారిలో మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు.  కోట్లాది మంది భ‌క్తివిశ్వాసాల‌తో ముడిప‌డిఉన్న ఈ జాత‌ర‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ముంద‌స్తు మొక్కులు చెల్లించుకునే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌నుల‌ను పూర్తిచేస్తామ‌న్నారు.  కోట్లాది భ‌క్తులు వ‌చ్చే జాత‌ర ప్రాశ‌స్త్యానికి త‌గ్గ‌ట్లు భారీ ఎత్తున స్వాగ‌త తోర‌ణాల నిర్మాణంతో పాటు గ‌ద్దెల వ‌ద్ద‌కు భ‌క్తులు సులువుగా చేరుకోవడం.. గ‌ద్దెల ద‌ర్శ‌నం, బంగారం (బెల్లం) స‌మ‌ర్ప‌ణ‌.. జంప‌న్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తున్నామ‌ని అన్నారు.  ప్ర‌ధానంగా గుడి ప్రాంగణంలో చేస్తున్న అభివృద్ధి పనులను,జంపన్న వాగు, స్తూపం నుండి బస్టాండ్ వరకు జరిగే రోడ్ల విస్తరణను పరిశీలించారు. జంపన్న వాగు అభివృద్ది , సుందరీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేశామ‌న్నారు.  మేడారం అభివృద్ధి ప‌నుల్లో గిరిజ‌న సంప్ర‌దాయాలు, విశ్వాసాల‌కు ఎటువంటి భంగం క‌ల‌గ‌కుండా ప్ర‌తి నిర్మాణం, ప్ర‌తి క‌ట్ట‌డాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా, మేడారం జాత‌ర పూజారులు, ఆదివాసీ పెద్ద‌ల‌ సూచ‌నలతో  చేప‌డుతున్నామ‌ని చెప్పారు.  ఈ కార్య‌క్ర‌మంలో  ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కెఎస్ శ్రీ‌నివాస‌రాజు, ఆర్ &బి ఈ ఎన్ సీ మోహ‌న్ నాయిక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానొత్ రవి చందర్  ,  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి , రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మనోజ్ కుమార్ , మండల మాజీ అద్యక్షులు జాలపు అనంత రెడ్డి , జిల్లా నాయకులు , మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *