‘విన్నపమాలకింపు రఘువీర! నహి ప్రతిలోకమందు నా/కన్న దురాత్మున్దున్, బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ/ కన్న మహాత్మున్దున్, బతిత కల్మష దూరుడు లేడు నాగ వి/ ద్వన్నుత నీవె నాకు గతి దాశరథి! కరుణాపయోనిధీ!’ అన్న పద్యం వినగానే, ఇది రాసింది కంచర్ల గోపన్నని, ఈయనకు ‘భక్త రామదాసు’ అనే మరో పేరుకూడా ఉందని తెలుగునాట ఎవరైనా చెబుతారు. కానీ, కంచర్ల గోపన్న నిజంగా ఉన్నాడా? ఉంటే ఏ కాలంలో ఉన్నాడు? ఆయనకు తానాషాకు మధ్య గొడవ (ప్రభుత్వ నిధులను రామమందిర నిర్మాణానికై దారి మళ్లించటం) నిజమేనా, అక్కన్న మాదన్నలకు రామదాసు ఏమవుతాడు, భద్రాచలం తహసీల్దారుగా గోపన్నను ఎవరు నియమించారు, ఆయనను తానాషా గోల్కొండ కోటలో నిజంగా బంధించారా, ఏ కాలంలో, రామలక్ష్మణులు తానాషాకు కనపడి, బంగారు ‘రామటెంకెలు’ (నాణాలు) ఇచ్చి రామదాసును విడిపించారా, భద్రాచలంలో కనిపించే సీతారామలక్ష్మణ నగలు, రామదాసు బందిఖానాలో పాడిన కీర్తనలోని నగలు తానాషాకాలం నాటివేనా?- వంటి ప్రశ్నలు నేటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి.
రామదాసును శివాజీ విడిపించాడా బందిఖానానుంచి లేక తానాషానే విడిచిపెట్టాడా? ఔరంగజేబుకు తానాషాకు మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది, తానాషా ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు, ఎప్పుడు పదవీచ్యుతుడయ్యాడు, తానాషా పదవీచ్యుతుడయ్యే నాటికి రామదాసు జైలునుంచి విడుదలయ్యాడా, మాదన్న, అక్కన్నలను ఎవరు చంపించారు? ఈ ప్రశ్నలే ఇతివృత్తంగా సాగే ఈ వ్యాసం మొట్టమొదట భద్రాచలం దేవస్థానం వారు రామదాసు గురించి చెప్పినదానితో ఆరంభమవుతుంది. భద్రాద్రి దేవస్థానం వారి అధికారిక వెబ్ సైట్లో భద్రాచల ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక శక్తి, భద్రుడు తపస్సు, రామసాక్షాత్కారం, చివరకు పోకల దమ్మక్క కల, కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా అక్కడికి రావటం వివరించారు. అప్పట్లో అబుల్ హాసన్ తానాషా గోల్కొండ పాలించేవారని, ఆయనవద్ద పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలు గోపన్న మేనమామలని, నిరుద్యోగిగా ఉన్న కంచర్ల గోపన్నకు తహసీల్దార్ ఉద్యోగం ఇమ్మని వారు సిఫార్సు చేయటం, తదనుగుణంగా తానాషా కంచర్ల గోపన్నను భద్రాచల తహసీల్దార్ గా నియమించటం జరిగిందని తెలిపారు.
ఆ వెబ్ సైట్లో. అక్కడినుంచి రామదాసు గురువు భట్టాచార్యులవారి సలహా మేరకు, ఊరిప్రజల కోరిక మేరకు రాములవారి మందిర నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి తానాషా కంచర్ల గోపన్నను పిలిచి రామమందిర నిర్మాణానికి నిధులెక్కడినుంచి వచ్చాయని వివరం అడగటం, పూర్వాపరాలు, రామదాసు చెప్పిన వివరాలేమీ పరిశీలించకుండా కంచర్ల గోపన్నను ఖైదులో పెట్టమని తానాషా ఆజ్ఞ్యాపించటం, పన్నెండేళ్ల శిక్ష అనంతరం రామలక్ష్మణులు తానాషాను కలిసి బంగారు రామటెంకెలు ఇచ్చి గోపన్నను ఖైదునుంచి విడిపించటం రాశారు. అయితే అదే వెబ్ సైట్లో 17వ శతాబ్దంలో వాస్తవంగా జరిగిందేంటి అన్న వివరాలు కాలక్రమంలో లేవని కూడా పేర్కొన్నారు.
భయంకర తప్పులు తడకల ఆంగ్లంలో, వర్ణచిత్రాలతో వివరించిన ఈ భద్రాచల రామక్షేత్ర మహిమ, శ్రీ రామదాసు చరిత్ర అటుంచితే, ఈ వెబ్ సైట్ కథనం ప్రకారం కొన్నివిషయాలు స్పష్టం అవుతాయి. ఒకటి కంచర్ల గోపన్న, రామదాసు ఒకరే అని, గోపన్నను భద్రాచలం తహసీల్దార్ గా నియమించింది గోల్కొండ పాలకులేనని, భద్రాచలంలో శ్రీరామచంద్రుల దేవాలయం విషయమై అందిన ప్రజాధన దుర్వినియోగ అభియోగం పైననే గోపన్నను ఖైదు చేశారని, శ్రీ రామలక్ష్మణులే తానాషాకు బంగారు రామటెంకెలు వరహాలుగా ఇచ్చి గోపన్నను విడిపించారని స్థూలంగా నిర్ధారణ అవుతుంది. ఈ కథనంలో రామాలయ నిర్మాణానంతరం భక్తులకు అన్నదానం చేసేప్పుడు ప్రమాదవశాత్తు గోపన్న కొడుకు మరణిస్తే, గోపన్న శోకతప్తుడై, ఆర్తితో ప్రార్ధిస్తే రాములవారి అనుగ్రహంతో తిరిగి పునర్జీవితుడవటం కూడా నిర్ధారించారు.
అయితే భద్రాచల రామదాసు గురించి వికీపీడియాలో కొన్ని వివరాలున్నాయి. వికీపీడియా ప్రకారం రామదాసు అనే కంచర్ల గోపన్న 1620-1688 మధ్య ఉన్నాడని తెలుస్తుంది. ఈయన వాగ్గేయకారుడని, శ్రీ రాముడికి గొప్పభక్తుడని, కవి అని ఇందులో పేర్కొన్నారు.
వీరి స్వగ్రామం నేలకొండపల్లి. ఈయన అసలు పేరు కంచర్ల గోపన్న అని, తండ్రిపేరు లింగన్న మంత్రి, తల్లి కామాంబ అని, చిన్నప్పుడే ఇతనికి ‘తన’ అనే వారెవ్వరూ లేకపోతే, రామభజనలు, కీర్తనలు పాడుకొంటూ ఆ గ్రామంలోనే భిక్షం ఎత్తుకొనే వారని రాసుంది. అలా చిన్నప్పుడే రామభజన చేయటం వలననే ఆ ఊరులో ఈ బాలుడికి ‘రామదాసు’ అని పేరు వచ్చిందన్నట్లుంది. నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడైనా భిక్షాటన చేస్తూ జీవించేకాలంలో రఘునాథ భట్టాచార్య అనే శ్రీ వైష్ణవ గురువు ఈయనను చేరదీసి ‘దాశరథి’ సంప్రదాయంలోకి తీసుకువచ్చారు. ఈ విధమైన రామదాసు వివరాలు ఆయన కవిత్వం నుంచి, హరికథ, యక్షగాన కథలనుంచి కూర్చినవేనని కూడా వికీపీడియా పేర్కొంది.
ఇంకా రామదాసుకు గోల్కొండ అబుల్ హాసన్ తానాషా దగ్గర పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలు వరుసకు మేనమామలని కూడా ఈ వికీపీడియా పేర్కొంది. అబ్దుల్ కుతుబ్ షా 1672లో చనిపోయిన తరువాత ఆయన అల్లుడు అబుల్ హాసన్ తానాషా అధికారంలోకి రావటానికి అక్కన్న మాదన్నలు సహాయం చేసినందున తానాషా వీరిని తన ఆస్థానంలో మంత్రులుగా నియమించుకొన్నట్లు రాశారు వికీపీడియాలో. అబుల్ హాసన్ తానాషా పాలించే రోజులలో వారికీ ఢిల్లీ నవాబు మొఘల్ చక్రవర్తులలో చివరివాడైన ఔరంగజేబుకు మధ్య గొడవలు జరుగుతుండేవని కూడా ఇందులో రాశారు. (ఇంకా ఉంది)
డా. కొప్పరపు నారాయణమూర్తి