– అందజేయనున్న ముఖ్యమంత్రి
– సీఎస్ రామకృష్ణారావు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు ఈనెల 27న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వెల్లడిరచారు. శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో నిర్వహించనున్న కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికైన 563 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందిస్తారని, దాదాపు 18 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నట్టు సీఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక్కొక్క అభ్యర్థికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నియామకాల్లో అత్యధికంగా రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే ఉన్నందున, రెవిన్యూ, హోం, జీఏడి కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్. ఆదేశించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాలలో సర్వీస్‌లో ఉంటారు కాబట్టి వీరికి హార్థిక ఉత్తేజకరమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని, ప్రభుత్వ సర్వీస్ పట్ల వారికి ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సబ్యసాచి ఘోష్, వికాస్‌రాజ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





