చిత్ర పరిశ్రమలో మరో విషాదం

నిర్మాత కె.మహేంద్ర మృతి

గుంటూరు, జూన్‌12: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్‌ అధినేతగా పేరుగాంచిన కె.మహేంద్ర (79) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన పూర్తి పేరు కావూరి మహేంద్ర కాగా, స్వస్థలం గుంటూరు. ఫిబ్రవరి 4, 1946లో జన్మించారు. దర్శకుడు కావాలని అనుకుని సీనియర్‌ దర్శకులు కే ప్రత్యగాత్మ, కే హేమాంబరధర రావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ’ప్రేమించి పెళ్లి చేసుకో (1977)తో నిర్మాతగా మారారు. తర్వాత ఏది పుణ్యం? ఏది పాపం?, ఆరని మంటలు, తోడు దొంగలు, బందిపోటు రుద్రమ్మ, ఎదురలేని మొనగాడు, ఢాకూరాణి, ప్రచండ భైరవి, కనకదుర్గ వ్రత మహాత్మ్యం తదితర చిత్రాలను నిర్మించారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ పోలీస్‌ చిత్రం నిర్మించిన ఆయన మళ్లీ శ్రీహరితోనే దేవా’ సినిమాను నిర్మించారు. మహేంద్రకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెను మాదాల రవి వివాహం చేసుకున్నారు. కొద్దికాలం క్రితమే తనయుడు జీతు మరణించాడు. కాజల్‌ అగర్వాల్‌ తెలుగు తెరకు పరిచయమైన నందమూరి కళ్యాణ్‌ రామ్‌ – దర్శకుడు తేజల లక్ష్మీ కళ్యాణం నిర్మించింది మహేంద్రనే. యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ హీరోగా అర్జున్‌, ఊహ నటించిన ప్రేమ లేని పుట్టిల్లు కరోనాకు ముందు పోసాని కృష్ణమురళి నటించిన దేశముదుర్లు సినిమాలు కూడా ఈయన నిర్మాణంలో రూపొందినవే. రాజశేఖర్‌ నటించిన అర్జునా ఇంకా విడుదల కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *