చలో దిల్లీ మార్చ్‌కు పిలుపు.. అడ్డుకున్న పోలీసులు
తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. శనివారం మధ్యాహ్నం ‘చలో దిల్లీ’ మార్చ్‌ను ప్రారంభించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే, రైతులను శంభు సరిహద్దు వద్ద హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రైతుల దిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకోవడం ఇది మూడోసారి. డిసెంబర్ 6 నుంచి దిల్లీ వైపునకు వెళ్లేందుకు రైతులు యత్నించగా.. రెండుసార్లు పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసుల తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల దిల్లీ మార్చ్ నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం అప్రమత్తమైంది.
ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 17 అర్ధరాత్రి వరకూ సేవలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని రైతులు ప్రధానంగా కోరుతున్నారు. రుణ మాఫీ చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ చార్జీలు పెంచరాదని, రైతులపై పెట్టిన పోలీస్ కేసులు ఎత్తివేయాలని, 2021 లఖింపూర్ ఖీరి బాధితులకు న్యాయం చేయాలని, భూ సేకరణ చట్టం 2013ను పునరుద్ధరించాలని, ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.





