అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం

  • రవీంద్రభారతిలో ఘనంగా దాశరథి శతజయంతి వేడుకలు
  • హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22   హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అన్నవరం దేవేందర్‌ (Annavaram Devendar) కు ప్రతిష్టాత్మక దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని మంగళవారం జరిగిన వేడుకల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మామిడి హరికృష్ణ, రచయితలు అందెశ్రీ, జయరాజ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గత ఏడాది జూకంటి జగన్నాథం, ఈసారి అన్నవరం దేవేందర్ కి దాశరథి అవార్డు ఇచ్చుకుని గౌరవించుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. దాశరథి కృష్ణమాచార్య తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, గ్రామీణ జీవనం, పల్లె భాష, శ్రమైక జీవన సౌందర్యం అట్టడుగు వర్గాలు తెలంగాణ ఉద్యమం ఆయన కవిత వస్తువులుగా తీసుకున్నారని తెలిపారు. అణచివేతకు ,నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. 2009- 14 మధ్య పార్లమెంట్  లో తెలంగాణ ఉద్యమంలో దాశరథి మాటలు మాకు ఎంతో స్పూర్తినిచ్చాయన్నారు.1944 లో ఒక కవి సమ్మేళనం జరిగితే దానిని జరగవద్దని నిజాం నిరంకుశత్వంగా వ్యవహరిస్తే అక్కడే కవి సమ్మేళనం నిర్వహించారని తెలిపారు. అన్నవరం దేవేందర్ లాంటి వేల మంది కవులు దాశరథి లాంటి రచనలు చదివి కవులయ్యారని చెప్పారు. అన్నవరం దేవేందర్ తాను కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ లో డిగ్రీ చదివినప్పటి నుంచీ గమనిస్తున్నానని తెలిపారు.   అద్భుతమైన రచయిత అయిన దేవేందర్ కు దాశరథి అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. ఆయన  రచనలు రాబోయే తరానికి యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *