-పౌష్టికాహారం, బోధనలో అగ్రగామిలా ఉండేలా కార్యాచరణ
-రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు
-దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం.
– సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1: తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు అయిదేళ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖలపై తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలకు నూతన భవనాలు నిర్మించే అంశంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, పిల్లల అభిరుచులకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలని సీఎం పేర్కొన్నారు. సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్‌తో కంటైనర్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌకర్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బాలామృతం ప్లస్‌ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టిసారించాలన్నారు. అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందజేత, అంగన్‌వాడీల పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారు. కాగా, అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారని, అదే సమయంలో ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మన పిల్లలను సింగపూర్‌లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నామని, అక్కడకు పంపే వారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలని కూడా ఆదేశించారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా నిర్దేశిత సమయంలో పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధించేందుకు ఆసక్తి చూపితే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.
వృద్ధులకు భరోసా
ఉద్యోగాలు చేస్తున్న పలువురు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అలాంటి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రులకు ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అస్సాంలో అలాంటి పథకం అమలవుతోందని, ఇతర రాష్ట్రాల్లోనూ అలాంటివి ఉంటే పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతోపాటు ఐటీ, ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్‌లో..
తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిథ పథకాల్లో వారికి ప్రోత్సాహాకాలు కల్పించడంపై అధ్యయం చేసి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి నివేదిక సమర్పించాలన్నారు. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలు, ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్దుల శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన, తెలంగాణ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ కులాల అభివృద్ధి, ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.



