అంగన్‌వాడీల సమస్యలు పట్టని సర్కారు

– ‘చలో సెక్రటేరియట్‌’కు వచ్చేవారి అరెస్టులు దారుణం
– మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: తమ సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండిరచారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్‌ రెడ్డి అంగన్‌వాడీలను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా,, గుర్తింపు లేదా.. ప్రజా పాలన అని రాక్షస పాలన కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి వారి ఉసురు తగులుతుందన్నారు. అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్‌ వారు వర్కర్లు కాదని, అంగన్‌వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించి వారి గౌరవాన్ని పెంచారని ఆయన గుర్తు చేశారు. 2014 నాటికి అంగన్‌వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.7,800లకు, అంగన్‌వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800కు కేసీఆర్‌ పెంచి దేశంలోనే అత్యధిక వేతనం చెల్లించారన్నారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్‌ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని, మాయ మాటలు చెప్పి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీగతీ లేదని హరీష్‌రావు విమర్శించారు. మహాలక్ష్మి పేరిట మీరు అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో జిల్లాల నుంచి సచివాలయానికి వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నారు.. మీ మోసపూరిత వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *