ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఉద్యోగుల పెండిరగ్‌ మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ క్లియర్‌
గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులు సైతం క్లియర్‌
మొన్న 2 డిఏలు పెంపు,
9 రోజుల్లో రూ.9వేల కోట్లు ’రైతు భరోసా‘ జమ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి గురువారం విడుదల చేశారు. తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన ప్రజా ప్రభుత్వం విపక్షాల అంచనాలను తలకిందులు చేస్తూ ఆ మరుసటి రోజే ఉద్యోగుల మెడికల్‌ రియంబర్స్మెంట్‌ బిల్లులు రూ.180.38 కోట్లు క్లియర్‌ చేయడం గమనార్హం. ఈనెల 13న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డిఏలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, తాజాగా మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లులను క్లియర్‌ చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం వాటిని క్లియర్‌ చేశారు. గత ప్రభుత్వం కాలంలో 4-3-2023 నుంచి 20-6-2025 వరకు పెండిరగ్‌లో ఉన్న బిల్లులను ఒకేసారి క్లియర్‌ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 27 నెలలుగా మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబంగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలను పెంచుతూ ఈనెల 13న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 3.50 లక్షల మంది రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఒక డీఏకు ప్రతినెలా ప్రభుత్వ ఖజానాపై రూ.2,400 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. వీటితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖలో, ప్రణాళికా శాఖలో క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జనాభాను అనుసరించి గ్రామ పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తున్నారు. వీటితోపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డీపీసీ కమిటీలు వేగం పెంచాయి. 15 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 7.50 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *