వైభవంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
వరంగల్ మహానగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంతరం అర్చకులు అమ్మవారిని భవానీమాతగా అలంకరించారు. అమ్మవారు శంకరుడికి భవాని రూపంలో సమస్త భోగాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది. భవానీమాతను దర్శించుకోవడం వలన సమస్త భోగాలు కలుగుతాయి. అయితే మంగళవారం అమ్మవారికి కాత్యాయని క్రమంలోను, భోదాయనమహర్షి ప్రోక్త నవరాత్రా కల్పాన్ని అనుసరించి ధూమ్రహా క్రమంలోను పూజారాధనలు జరిపారు. అట్లాగే అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. సాయంకాలం సాలభంజిక సేవ జరిపారు.
బుధవారం అమ్మవారిని సరస్వతిగా అలంకరిస్తారు. అమ్మవారి విశేష అలంకరణకు కరీంనగర్ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త యాదా కిషన్–శోభ దంపతులు, మంచాల శ్రీకాంత్–కవిత దంపతులు, మంచాల నవీన్– స్వప్న దంపతులు, రేగూరి ఆంజనేయులు–సరళ దంపతులు, హైదరాబాద్ శారదా విద్యా సంస్థల అధినేతలు సందెపూడి రవిశంకర్–మానస, తిక్కవరపు కేశవ రెడ్డి–మంజుల దంపతులు, అభిరామ్ రెడ్డి– సింధూర దంపతులు తదితరులు ఉభయ దాతలుగా వ్యవహరించారు
. పూజానంతరం ఉభయ దాతలకు ఆలయ ఈ.ఓ శ్రీమతి శేషు భారతి శేష వస్త్రాలు బహుకరించి ప్రసాదాలు అందజేశారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి తెప్పోత్సవం సందర్భంగా భద్రకాళి చెరువులో గుర్రపు డెక్క ఆకు తొలగింపు కార్యక్రమం పరిశీలించారు. తదుపరి యాదగిరిగుట్ట ఛైర్మన్ భాస్కరాయని నరసింహ మూర్తి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం హరికథ, భక్తి సంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.





