ట్రంప్ వాచాల, చపల వైఖరితో అమెరికా తిప్పలు!!

నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సోమవారం ‘ట్రూత్’ సామాజిక మాధ్యమం ద్వారా     “ఈ రాత్రి ఒక మొత్తం నాగరికత అంతమైపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు,” అనీ   అయితే ఈ దాడులను నివారించడానికి “బహుశా ఏదైనా అద్భుతమైన విప్లవాత్మక మార్పు జరగవొచ్చు” అని తాను ఆశిస్తున్నట్లు .. “ప్రపంచ సుదీర్ఘ మరియు సంక్లిష్ట చరిత్రలో అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటైన ఈ రాత్రి మనకు విషయం తెలుస్తుంది.” అని పేర్కొనడం ఆయన మానసిక సంతులిత కోల్పోయినట్లుగా  కనిపిస్తున్నది.
అనుకున్నది ఒక్కటి, ఐనది మరొక్కటి కావడం, ఇంటా బయటా తీవ్రస్థాయి వొత్తిళ్లు, వేగంగా పడిపోతున్న రేటింగ్, వొచ్చే నవంబర్‌లో అవిశ్వాసం ఎదుర్కొనాల్సి వొస్తుందన్న ఆందోళన వెరసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇదే సమయంలో తనకు చిరకాల మిత్రులుగా ఉన్న  నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి రాకపోవడం, ముగ్గులోకి దించిన ఇజ్రాయిల్ తన మానాన తాను దాడులు చేసుకుపోతుండటం, అసలే దిగజారిన ఆర్థిక వ్యవస్థపై రోజువారీ యుద్ధం ఖర్చు “మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా” మారడంలో ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలో తెలియక ట్రంప్ తలపట్టుకోవాల్సి వొస్తోంది.
ఇరాన్ విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నేతన్యాహు వివరించిన వ్యూహం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఏటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. స్వదేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, అదుపుతప్పుతున్న ద్రవ్యోల్బణం, అనవసర యుద్ధాన్ని నెత్తిన రుద్దారంటూ ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం ట్రంప్‌కు నిద్రపట్టనివ్వడంలేదు. ఏ రష్యాను ఆర్థికంగా అణగదొక్కాలనుకున్నాడో, ఆ దేశం ఇప్పుడు ఆర్థికం గా నిలదొక్కుకోవడం, పుతిన్ ఆడుతున్న శక్తివంతమైన రాజకీయ చదరంగం లో చిక్కుకుపోయి నిస్సహాయ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం తప్ప ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితి! వీడని చిక్కుముళ్లతో చికాకు పడుతున్న ట్రంప్‌ను చూసి పుతిన్ విలాసంగా నవ్వుకుంటున్నారు. ఇదిలావుండగా దేశీయంగా తాను చేసిన ఆర్థికపరమైన కార్యక్రమాలు ప్రజల్లోకి సరిగ్గా వెళ్లకపోవడానికి ప్రతినిధులే కారణమంటూ మరోపక్క ట్రంప్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ రోజువారీగా మాట్లాడే మాటలకు పొంతనే ఉండటం లేదు. ఉదాహరణకు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడంలో  “ప్రపంచ దేశాల సహాయం కావాలి” అంటూ మార్చి నెలలో ఒక ప్రకటన చేసిన కొద్ది గంటలకే మాట మార్చేసి “ఈ విషయంలో మాకు ఎవరి సహాయ సహకారాలు అవసరంలేదు” అని చెప్పడం ట్రంప్‌లో నెలకొన్న వైరుధ్య భావనకు నిదర్శనం. ఇరాన్ నాయకత్వాన్ని, సైనిక శక్తిని నాశనం చేశామని చెబుతూనే మరోవైపు ఇరాన్ వల్ల ప్రమాదం పొంచిఉంది , సైనిక చర్యలు కొనసాగించాలంటున్నారు. ఇరాన్‌లోని చమురు క్షేత్రాలపై ఇజ్రాయిల్ దాడులు చేసిన సంగతి తనకు తెలియదని ట్రంప్ స్పష్టం చేస్తుంటే, వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి పత్రికలు మాత్రం ఈ దాడి విషయం ఆయనకు తెలుసని వార్తాకథనాలు ప్రచురించాయి. ఒకవేళ ట్రంప్ మాటలే నిజమైతే, ఇజ్రాయిల్ ఆయనకు ఇసుమంత విలువ కూడా ఇవ్వడంలేదన్నది సుస్పష్టం.
మరోవైపు తనకు ఇంతటి నష్టాన్ని కలిగించిన యు.ఎస్.ను వొదిలే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేయడంతో, అనవసరంగా తెచ్చిపెట్టుకున్న యుద్ధం ఊబి నుంచి ఎట్లా బయటపడాలో ట్రంప్‌కు అర్థం కాక, పూటకో మాట, రోజుకో తీరు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వొచ్చి ముఖ్యంగా ఇరాన్‌పై దాడులు మొదలు పెట్టిన తర్వాత ట్రంప్ వ్యవహారశైలిలో ఒక అగ్రరాజ్యాధినేతకు ఉండాల్సిన రాజనీతిజ్ఞత పూర్తిగా కొరవడటం గమనార్హం. గతంలో పనిచేసిన అమెరికా అధ్యక్షులెవరూ ఇంతటి స్థాయి అనాలోచిత వ్యవహారశైలిని ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఈ యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని ట్రంప్ ఒక పక్క చెబుతుంటే, అధికార్లు మాత్రం ఇదొక ఆరంభం మాత్రమేనని చెబుతుండటంతో అమెరికన్లలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అయోమయం నెలకొంటున్నది . ట్రంప్ అనుసరిస్తున్న ఈ గందరగోళ వ్యవహారశైలిని “ద వీవ్‌” అని పిలుస్తారు. దీన్నొక బాధ్యతల నుంచి తప్పించుకునే పలాయనవాదంగా మానసిక విశ్లేషకులు చెబుతున్న మాట.
ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, ప్రసంగ శైలిపై శ్వేతసౌధం స్పందన కూడా గందరగోళంగా ఉంది . “సంక్లిష్టమైన కథనాలను, విధానాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే రీతి ఇది” అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్, ఇతర అధికార్లు చెప్పడాన్ని చూస్తుంటే “యధా రాజ…తథా బంటు” అన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” అనుకున్న విధంగానే కొనసాగుతున్నదంటూ వైట్ హౌజ్ అధికార్లు ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. అంతేకాదు ట్రంప్ బెదిరింపుల మనిషి మాత్రమే కాదని, ఆయన మాటల వెనుక శక్తివంతమైన సైనిక చర్యలుంటాయని మరువకూడదన్నది కూడా వారి భాష్యం! కేవలం ఇరాన్ నాయకత్వాన్ని ఒత్తిడికి గురిచేయడమే ఆయన ప్రకటనల సారాంశమన్నది వారి వివరణ!
ట్రంప్ ప్రకటనలపై కొందరు అధికార్లు మరింత ముందుకెళ్లి “ఇవి వ్యూహాత్మక ఆయుధంగా”, ప్రత్యర్థి దేశాలకు అమెరికా తదుపరి అడుగు ఏంటో  తెలియకుండా చేయడమే ఈ మాటల వెనుక ప్రధాన లక్ష్యమని వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ఆశావాదంతో మాట్లాడుతుంటే, యంత్రాంగం వాస్తవ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని వైట్ హౌజ్ అధికార్లు చెబుతున్నారు.  వీటన్నింటిని పరిశీలిస్తే, ట్రంప్ తాను గందరగోళంలో ఉండి, ఇతరులను మరింత అయోమయానికి గురి చేస్తుంటే, వైట్ హౌజ్ అధికార్లు, ఎవరికీ అర్థం కాని రీతిలో ట్రంప్ అస్థిర వ్యవహారశైలిని వివరించడానికి ప్రయత్నిస్తుండటం విచిత్రాల్లోకెల్లా విచిత్రం! ఈ పరస్పర వైరుధ్యాల కారణంగా ఇప్పటివరకు అగ్రరాజ్యంగా ఉన్న  అమెరికా ప్రతిష్ట అట్టడుగుకు దిగజారుతోంది. రక్షణ కల్పిస్తామని గల్ఫ్ దేశాలు, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలనుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేస్తున్న అమెరికా తనను తాను రక్షించుకోవడానికే సతమతమవుతున్న దుస్థితిని చూసి దాన్నొక “కాగి తపు పులి”గా అంచనా వేస్తున్నాయి.
ఒక వ్యాపారవేత్తగా ప్రత్యర్థులను తికమక పెట్టే రీతిలో చేసే ప్రకటనలు రాజకీయాల్లో పనిచేయవు. ప్రపంచ దేశాల్లో ఉద్దండులైన రాజనీతిజ్ఞులతో ఇటువంటి ఫక్తు వ్యాపార శైలి ఎంతమాత్రం పనిచేయదు. ఒక అగ్రరాజ్యాధి నేతగా తన తలతిక్క వ్యవహారశైలితో ట్రంప్ అమెరికా పరువును బజారు కీడుస్తున్నారనుకోవాలి! ఇరాన్‌తో యుద్ధంలో దెబ్బతింటే అమెరికా ప్రతిష్ట బాగా దెబ్బతినడం ఖాయం! ఇజ్రాయిల్ వైఖరి చూస్తుంటే, అమెరికాను ఎంతమాత్రం పట్టించుకోకుండా తన లక్ష్యాలకనుగుణంగా ముందుకెళుతోంది. ఇరాన్ తన ప్రతీకార వైఖరిని కొనసాగిస్తోంది.ఇద్దరూ అమెరికాను ఖాతరు చేయడం లేదు. ఈ యుద్ధంలో ట్రంప్ స్థానం ఒక జోకర్ స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఇరాన్ కూడా చమురును చక్కగా ఎగుమతి చేసుకుంటోంది. రష్యా సరేసరి! “దారి తెలియని బాటసారి” మాదిరిగా  తనకు సంబంధంలేని యుద్ధంలో ఇరుక్కొని  ట్రంప్ ముందుకెళుతూ, అమెరికాను ముంచుతున్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *