అమర్‌నాథ్ యాత్ర రద్దు
దిల్లీ: అమర్‌నాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ భక్తురాలు మృతిచెందింది. భారీ వర్షాల కారణంగా గందర్‌బాల్ జిల్లా బల్తల్ ఏరియాలోని అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల పరిస్థితి దారుణంగా మారింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం బల్తల్ దారిలో కొండపైకి వెళుతున్న కొంతమంది భక్తులు బురదలో కొట్టుకుపోయారు. ఓ మహిళ చనిపోయింది. మరికొందరు గాయపడ్డారు. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. కొండపై చిక్కుకుపోయిన వారిని సురక్షితమైన ప్రదేశానికి తరలించాయి. ఇక భారీ వర్షం కారణంగా అమర్‌నాథ్ యాత్ర సైతం రద్దయింది. యాత్ర పున:ప్రారంభంపై స్పష్టత లేదు. వర్షం కారణంగా యాత్ర సాగే రెండు దారులు బాగా ధ్వంసమయ్యాయి. దీంతో ది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. యాత్ర సాగే రెండు మార్గాలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నది.





