దారులన్నీ మేడారం వైపే

– మహాఘట్టానికి సిద్ధమైన మేడారం
– సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాక

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్కల మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమైంది. అన్ని దారులు మేడారం వైపే అన్నట్లు ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. లక్షలాదిగా తరలి వస్తుండగా సాయంత్రం జరిగే తొలి ఘట్టం, అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వివరించారు. మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ఈరోజు సాయంత్రం ప్రారంభం కానుందని, సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దె మీదకు తీసుకు వస్తారని తెలిపారు. లక్షలాది భక్తుల హర్షధ్వానాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వేంచేయనున్నట్లు తెలిపారు. నిన్న పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు బయలుదేరారని, ప్రస్తుతం గోవిందరాజు కొండాయి నుంచి మేడారం చేరుకుని స్థానిక సారలమ్మ ఆలయంలో అలాయ్-బలాయ్ స్వీకరిస్తున్నారని మంత్రి వివరించారు. సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లె నుంచి సారలమ్మ మేడారానికి బయలుదేరుతారని తెలిపారు. రెండేళ్ల వనవాసం పూర్తి చేసుకుని తల్లులు జనవాసంలోకి ప్రవేశించే ఈ క్షణం భక్తులందరికీ అపూర్వమైన అనుభూతి అని అన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం క్యూలైన్లను సక్రమంగా నిర్వహిస్తున్నామని, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు నీడ కల్పించే విధంగా విస్తృతంగా షెడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా భక్తి,శ్రద్ధలతో, బాధ్యతతో తల్లులను దర్శించుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలి

సమక్కసారలమ్మ జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కోరారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో బుధవారం జాతర సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులకు, మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క టీ షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోట్లాదిమంది భక్తుల కొంగు బంగారంమైన సమక్క సారలమ్మ జాతరకు భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఈ జాతరలో ప్రస్తుత సంవత్సరం అనేక మార్పులు చేసినప్పటికీ ఎక్కడా ఆదివాసుల అస్థిత్వం, ఆత్మగౌరవం, పూజా విధానంలో మార్పు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుత సంవత్సరం 40 రోజుల సరిపడా ఏర్పాట్లు చేశామని, టాయిలెట్స్, తాగు నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు అదనపు కార్మికులను ముందుగానే సిద్ధం చేశామని చెప్పారు. జాతరకు ఇప్పటివరకు 20 లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా వేశామన్నారు. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సమయానికి మీడియాకు సైతం పెద్ద హాల్, మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకుడు డి.ఎస్.జగన్, ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు, వెంకట సురేష్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *