25 నుంచి అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ 

-హైద‌రాబాద్‌లో నిర్వ‌హ‌ణ‌
– డిజిపి శివధర్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16 : హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడా సంబరానికి తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ బలగాల నుంచి క్రీడాకారులు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఈ మెగా టోర్నీ కోసం నగరంలో గచ్చిబౌలిలోని జి.ఎం.సి బాలయోగి స్టేడియం, అజీజ్ నగర్‌లోని హెచ్.ఎఫ్.సి గొగ్జీస్ స్పోర్ట్స్ ఎరీనా, మొయినాబాద్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్, శివరాంపల్లిలోని జాతీయ పోలీస్ అకాడమీ మైదానం, గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్ గ్రౌండ్తె, లంగాణ పోలీస్ అకాడమీ మైదానాలు సిద్ధం చేశామని వివరించారు. గచ్చిబౌలి, హెచ్.ఎఫ్.సి మైదానాల్లో రాత్రి సమయాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా ప్లడ్ లైట్ల సౌకర్యం ఉందని ఆయన తెలిపారు. ఈనెల‌ 24న టీమ్ మేనేజర్ల సమావేశం, డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించి 25న మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలను నిర్వహిస్తామని, తొలి మ్యాచ్ లో తెలంగాణ పోలీస్ జట్టు ఆడుతుందని వెల్లడించారు. పోటీల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా ఒక ఐపిఎస్ అధికారితోపాటు 13 మంది డీఎస్పీ/అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి అధికారులు, 23 మంది ఇన్‌స్పెక్టర్లు, 35 మంది టీమ్ మేనేజర్లు పర్యవేక్షిస్తారన్నారు. ఏప్రిల్ 5న ముగింపు వేడుకలు నిర్వ‌హిస్తామ‌ని వివరించారు. ఈ ఛాంపియన్‌షిప్ లో పాల్గొనేందుకు ఇప్పటివరకు పురుషుల విభాగంలో 37 జట్లు, మహిళల విభాగంలో 9 జట్లు ముందుకు వచ్చాయని డిజిపి తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే ఆఖ‌రు కావడంతో మొత్తం 46 జట్లు ఈ ఫుట్‌బాల్ సమరంలో తలపడనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో ప్రదర్శించనున్న ప్రత్యేక లోగోలను డిజిపి ఖరారు చేశారు. సమావేశంలో ఆర్.బి.వి.ఆర్.ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, శాంతి భద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్, గ్రేహౌండ్స్ అదనపు డిజిపి అనిల్ కుమార్, టీజీఎస్పీ అదనపు డిజిపి సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్, ఐజిపిలు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ నాయుడు, హైదరాబాద్ అదనపు సిపి తప్సిర్ ఇక్బాల్, జాయింట్ సిపి శ్వేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *