మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం

– విమానాశ్ర‌యంలో ల్యాండింగ్‌ స‌మాయంలో ప్ర‌మాదం
– ఇద్ద‌రు పైల‌ట్లు, ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది కూడా దుర్మ‌ర‌ణం

ముంబై, జనవరి 28: ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66)  ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో బుధవారం ఉదయం కూలిపోయింది. ముంబై నుంచి బార‌మ‌తి వెళ్తున్న‌ చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో జరిగిన ఈ ప్రమాదంలో పవార్, మరో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, అజిత్ భద్రతా సిబ్బంది ఇద్దరు మరణించారు. ఆ ప్రాంతం అంతటా చెల్లాచెదురుగా ఉన్న శిథిలా, విమానం నుండి మంటలు, దట్టమైన పొగ నెలకొన్నాయి. పవార్ ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

న్యూదిల్లీ:  విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందిన వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో రాణిస్తూ.. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారని తెలిపారు. మహారాష్ట్రకు సుదీర్ఘకాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారన్నారు. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంపై పట్టు సంపాదించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని, వారి అకాల మరణం రాష్ట్ర ప్రజలకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీయే కూటమికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ప్రజల తరపున, కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంతాపం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆయనతోపాటు మరికొందరు మృతిచెందినట్లు తెలిసి తీవ్ర ఆవేదన కలిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, బాధిత కుటుంబాలకు ఈ దుఃఖ సమయంలో భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

మంత్రి సీతక్క సంతాపం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం పట్ల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న‌ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు, ప్రజా జీవితానికి తీరని నష్టమని అన్నారు. ప్రజాసేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మంత్రి సీతక్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

One comment

  1. “ప్రజాతంత్ర” తెలంగాణీయుల తొలి తెలుగు దినపత్రిక.
    చదవండి చదివించండి.
    సమాచారం, సద్విమర్శ, సహేతుకంగా, సందర్భోచితంగా, నిరచభయంగా,పక్షపాత ధోరణి లేకుండా, నిజాలనే అందిస్తున్న, ప్రజాతంత్ర దినపత్రిక కు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *