– నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయుల నియామకం
– టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన ఏఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మహాముత్తారం మండలంలో రూ.2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీవిబి జూనియర్ కళాశాల భవన ప్రారంబోత్సవం, వివిధ గ్రామాల్లో రూ.70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, రూ.72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ పంచాయతీల్లో రూ.కోటి 40 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనాల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకుపెద్ద పీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాణ్యమైన బోధనకు డీఎస్సీ నిర్వహించి టీచర్ల నియామకం చేపట్టామని, ఉపాధ్యాయులకు పదేళ్లుగాపెండింగ్ ఉన్న పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు కాటిక్, డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని తెలి పారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్ళపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. బాలికా విద్యకు ఇబ్బంది కలగకూడదని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మన ప్రాంతంలో పెద్ద ఎత్తున కెజిబివి, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం ఖచ్చితంగా చదవాలని, చదువు ఉజ్వల భవిష్యత్తుకు తప్పక ఉపయోగ పడుతుందని అన్నారు. గ్రామంలో ఒక్కరు చదువుకున్నా వారు మాత్రమే కాకుండా మొత్తం గ్రామమే బాగుపడు తుందని తెలిపారు. 10వ తరగతి పరీక్షలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కెజిబివిలో 10 వతరగతి విద్యార్థులకు టి ఫైబర్ ద్వారా ఏఐ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కోట రాజాబాబు, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, డిఇఓ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిర్మల సమ్మయ్య, ఈఈలు, కెజిబివి ఎస్‌ఓ పుష్పవతి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





