ఏఐ ఆర్థిక ఆవిష్కరణల కేంద్రంగా హైద‌రాబాద్‌

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం నాడు బాచుపల్లిలోని విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్  నిర్వహించిన సిఎఫ్ ఓ ల సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేసారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయన్నారు. కృత్రిమ మేధ టెక్నాలజీ పాత్రను పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటివరకు కంపెనీ ఖర్చులను లెక్కించడానికి ఉపయోగపడిన టెక్నాలజీ ప్రస్తుతం ఆవిష్కరణలు, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహాయపడుతోంది. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందింది. వ్యాన్ గార్డ్, యుబిఎస్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మాస్ మ్యూచువల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జెపి మోర్గాన్ చేస్, గోల్డ్ మ్యాన్ శాక్స్, సిటి గ్రూప్ లాంటి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు నగరంలో భారీ టెక్నాలజీ, అనలిటిక్స్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. నగరంలో ప్రస్తుతం 400 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు మూడు లక్షల మందికి పైగా వృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణ ఐటీ రంగం ఎగుమతులు సంవత్సరానికి దాదాపు 40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. తదుపరి దశ విస్తరణ కోసం ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐకేఏఎంలను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. వీటి ద్వారా ఏఐ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడం, డిజిటల్ మౌలిక వసతులను మెరుగుపర్చడం, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిపుణులను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. డిజిటల్ యుగంలో సీఎఫ్‌ఓల పాత్ర మరింత కీలకంగా మారింది. కృత్రిమ మేధ, డేటా ఆధారిత రంగాల్లో పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడంలో వారి సేవలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నా యని శ్రీధర్ బాబు వివరించారు. సదస్సులో మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి, ప్రముఖ నిర్మాత, విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (విజెఇఎం) అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్ బాబు, ఫిక్కి సిఎఫ్ ఓ కౌన్సిల్ ఛైర్మన్ రజనీష్ జైన్, కో ఛైర్మన్ సుబ్బయ్య కుమార్, విజ్ణాన జ్యోతి సంస్థల సిఇఓ, మాజీ డిజిపి అనురాధ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *