– ఇందుకు విధివిధానాలు తయారు చేయాలి
– ఏప్రిల్ ఆఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులు కొనుగోళ్లు చేసిన పనిముట్లకు 40 శాతం సబ్సిడీ నిధులను సదరు కంపెనీలకు అందించే పద్దతి ఉందని, అలాకాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేసే అవకాశాలను పరిశీలించి అందుకు తగ్గ విధివిదానాలను తయారు చేయాలని ఆదేశించారు. రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను ఏప్రిల్ నెలాఖరుకు సిద్దంగా ఉంచుకోవాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు రెడ్కో సంస్థ సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట ప్రయోగాత్మకంగా జంగారెడ్డిపల్లి, జానంపేట రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలించిన తరువాత మొదటి దశలో రాష్ట్రంలోని 1600 రైతు వేదికలలో రెడ్కో ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించి నిల్వ ఉంచేందుకు ఇప్పటినుంచే చర్యలు ప్రారంభించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో వరి, పత్తి, మక్క వంటి ప్రధాన పంటల సాగు విస్తృతంగా జరుగుతుందని, ముఖ్యంగా మక్క పంటకు వరి లేదా పత్తి పంటలతో పోలిస్తే యూరియా అవసరం దాదాపు మూడింతలు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉండటం, నేలలో తేమ నిల్వ ఉండటం, అలాగే దక్షిణ పశ్చిమ రుతుపవనాలు సాధారణంగా ప్రారంభమవుతాయనే అంచనాల నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లలో ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్-2026కు రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





