బ్యాంకుల నిర్వచనం మారింది

– టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పులకనుగుణంగా సేవలు
– దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్‌, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడా నిర్వచనం మారింది. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకనుగుణంగా టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పులను అందిపుచ్చుకుంటూ వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అగ్రసేన్‌ బ్యాంక్‌ అమీర్‌పేట్‌ బ్రాంచిని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకమని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఆర్థిక సేవలను అందించడంలో ఇవి ముందున్నాయని అన్నారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక-2024 ప్రకారం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మందికిపైగా ప్రజలు వీటి సేవలను వినియోగించుకుంటున్నారని, మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ.5.5 లక్షల కోట్ల మార్కును దాటాయని, క్రెడిట్‌, డిపాజిట్‌ నిష్పత్తి 66.7 శాతం ఉందని వివరించారు. తెలంగాణలో 48 అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులు 321 శాఖల ద్వారా అర్బన్‌, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి టర్నోవర్‌ రూ.17వేల కోట్లు. క్రెడిట్‌, డిపాజిట్‌ నిష్పత్తి 66.7 శాతం ఉందని చెప్పారు.

తెలంగాణ మోడల్‌ ‘పాథ్‌’

సహకార బ్యాంకులు లాభాపేక్షతో కాకుండా ఖాతాదారుల ప్రయోజనాల కోసం కమ్యూనిటీ ఆధారిత సేవలను అందిస్తున్నాయని, కేర్‌ (కమ్యూనిటీ ఫోకస్డ్‌, అఫర్డబుల్‌ అండ్‌ యాక్సెసిబుల్‌ క్రెడిట్‌, రిలేషన్‌షిప్‌ బేస్డ్‌ బ్యాంకింగ్‌, ఎంపవరింగ్‌ లోకల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) మోడల్‌లో పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగ బ్యాంకుల అభివృద్ధికి పాథ్‌ (పాలసీ సపోర్ట్‌, యాక్సెస్‌ టూ డిజిటల్‌ టూల్స్‌, ట్రైనింగ్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌, హైబ్రిడ్‌ ఫైనాన్స్‌ ఎకోసిస్టమ్స్‌) మోడల్‌ను అనుసరిస్తోందని, యువత, వెనుకబడిన వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణ అనుసంధానాలు, గ్రీన్‌ లోన్స్‌ వంటి పథకాలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్‌ సమాజ్‌ ప్రెసిడెంట్‌ అనిరుధ్‌ గుప్తా, టిబారుమల్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రాంభరోసే గుప్తా, సోమాని ఇస్పాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అశోక్‌ కుమార్‌ సోమాని, అగ్రసేన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ప్రమోద్‌ కుమార్‌ ఖేడియా, సీనియర్‌ వైస్‌ చైౖర్మన్‌ నవీన్‌ కుమార్‌ అగర్వాల్‌, వైస్‌ చైర్మన్‌ సురేష్‌ కుమార్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *