బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్‌

‌- జీవో ఇస్తే నిలవదని తెలిసీ స్థానిక ఎన్నికల స్టంట్‌
– 42‌శాతం రిజర్వేషన్లకు ఎలా చట్టబద్దత వొస్తుందో తెలియదా
– ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి
– మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌తో కలసి ఆయన మాట్లాడారు. బీసీల రిజర్వేషన్‌ ‌జీఓ ద్వారా సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. ఈ  విషయంలో తమిళనాడు వెళ్లి కూడా అధ్యయనం చేసి వచ్చి వివరించామన్నారు. బీసీలను అవమానం చేసేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. జీఓ న్యాయస్థానంలో నిలబడదని సీఎం, మంత్రులు, అందరికీ తెలుసని అన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు.బీహార్‌, ‌మహారాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేయవద్దని కోరారు. రాహుల్‌ ‌గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్‌ ‌రెడ్డి జీవో ఎందుకు ఇచ్చారు.  42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామని జీఓ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలు ఏం చేస్తారు లే అని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చిందని ఆరోపించారు. 1992లో తమిళనాడు సీఎం జయలలిత, ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం భీష్మించి కూర్చోవడంతో కేంద్రం దిగివచ్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్ల తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం రేపే దిల్లీ వెళ్దామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది హెచ్చరించారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి దిల్లీకి కదలాలని, రిజర్వేషన్ల అంశం తేలే వరకు హైదరాబాద్‌ ‌రావద్దని సూచించారు. రాహుల్‌ ‌గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ ‌నేతలు స్టంట్‌ ‌చేస్తున్నారని మాజీమంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌విమర్శించారు.రాష్ట్రపతిని కలవకుండానే ఢిల్లీలో ధర్నా చేసి హంగామా చేశారని ఆరోపించారు. చట్టం పక్రియ పూర్తి కాకముందే జీవోఎలా తెస్తారని ప్రశ్నించారు.బీహార్‌లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.రాహుల్‌ ‌గాంధీ కోసం తెలంగాణలో బీసీలను బలి పెట్టి రోడ్లపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.స్టే వస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే చెప్తూ వచ్చారు.హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్‌ ‌నేతలేనని పేర్కొన్నారు. ఆపరేషన్‌ ‌సక్సెస్‌.. ‌పేషెంట్‌ ‌డెడ్‌ అనేలా కాంగ్రెస్‌ ‌వ్యవహరించిందని రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌దాసోజు శ్రవణ్‌ ‌పేర్కొన్నారు. అమలు కాదని తెలిసి కూడా మోసపూరిత జీవో తీసుకొచ్చి ఆగం చేశారని మండిపడ్డారు. బీసీల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్‌ ‌కూలిపోవడం ఖాయమని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *