ఆద్య కళకు అంతం లేదు

– మంత్రి దనసరి అనసూయ సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఆదికి అంతం లేదు.. ఆద్య కళకు కూడా కూడా అంతం లేదని మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివాసీల మూలాలను సమూలంగా పెకలించి కార్పొరేట్‌ వ్యవస్థ చేతికి అప్పచెప్పే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఆది ధ్వని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మూలవాసి దినోత్సవం సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో మూలవాసి ఉరుములు మెరుపులు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సీతక్కకు మూలవాసి కళాకారులు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వివిధ రూపాల్లో ఆదివాసీల జీవన విధానాన్ని విధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఆ జీవన విధానాన్ని సజీవంగా కాపాడేందుకు జయధీర్‌ తిరుమలరావు వంటి వారు కృషి చేస్తున్నారని చెప్పారు. తమ జాతి కళను, సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచీకరణ తెచ్చిన జీవనశైలి మార్పులతో ప్రాచిచీన కలలకు ఆదరణ తగ్గుతోంది ఆదివాసీల తిండి సహజత్వంతో కూడుకున్నది ఓసహజంగా దొరికే వస్తువుల్లో ఉండే పోషకాలు ఆధునిక వస్తువుల్లో లేవు.. సజ్జలు, కొర్రలు, జొన్న తిన్నప్పుడు అనాగరికులని అవమానించారు.. కానీ ఇప్పుడు ధనికులు మొత్తం అదే తిండి తింటున్నారని తెలిపారు. ఆద్య కళ మ్యూజియం కోసం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.. స్థలం కేటాయింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే కేవలం ఉత్సవము పండుగ కాదు హక్కులు, ఆదివాసీల జీవితాన్ని పరిరక్షించుకోవడంఅని అన్నారు. ఈ దేశానికి ఆదివాసీలే అసలైన యజమానులని రాహుల్‌ గాంధీ చెబుతూ ఉంటారన్నారు. ప్రతి జిల్లాలో ఆదివాసీ సమావేశాలను ఏర్పాటు చేసుకొని వారి హక్కుల కోసం పోరాడదామన్నారు. కార్యక్రమంలో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, అరుణోదయ విమలక్క, ప్రజాకవి జయరాజు, ఆద్య కళా మ్యూజియం డైరెక్టర్‌ జయధీర్‌ తిరుమలరావు, మాజీ ఐఏఎస్‌ చిరంజీవులు, యువ పురస్కార అవార్డు గ్రహీత పసునూరు రవీందర్‌, యువ రచయిత అపర్ణ తోట పాల్గొన్నారు.

ఆదివాసి దినోత్సవం సందర్భంగా సీతక్క శుభాకాంక్షలు

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని యావత్‌ ప్రపంచం ఆగస్టు 9న ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్ర ఆదివాసీ గిరిజన సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలు ఈ దేశంలో అత్యంత పురాతన జీవన సాంకేతికతను, విలువలతో కూడిన జీవన ధోరణిని కొనసాగిస్తున్న వారు అని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమైన జీవనశైలి, సమూహ జీవనం, సాంస్కృతిక వైవిధ్యం ఆదివాసీల ప్రత్యేకత అని కొనియాడారు. వారి చరిత్రను, వారసత్వాన్ని కాపాడుకోవడమే కాదు, వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి స్పష్టం చేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు విద్య, వైద్యం, ఉపాధి, జీవనోపాధిలో సాధికారత సాధించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ, ప్రతి రంగంలో ఆదివాసీలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇలాంటి దినోత్సవాలు కేవలం ఒక వేడుకకే పరిమితం కాకుండా ఆదివాసీల హక్కుల కోసం, భవిష్యత్‌ తరాలకు చైతన్యం పెంచే వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *