— సీజేఏపై దాడి వ్యవహారం
– సుప్రీంకోర్టులో ఎంట్రీని నిషేధిస్తూ ప్రకటన
న్యూదిల్లీ, అక్టోబర్ 9: సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ చర్యలు ప్రారంభించింది. రాకేశ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై ఓ న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇలాంటి అస్థిరమైన ప్రవర్తన కోర్టు అధికారికి పూర్తిగా తగదని, వృత్తిపరమైన నీతిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. సుప్రీంకోర్టు గౌరవాన్ని కూడా కాలరాయడమేనని తెలిపింది. న్యాయవాది రాకేశ్ కిశోర్ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై.. పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. కాగా.. ఘటన నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రాకేశ్ కిశోర్ లాయర్ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై లాయర్ కిశోర్ తన కాలి బూటుతో దాడికి యత్నించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై దాన్ని అడ్డుకొని ఆయన్ను బయటకు తరలించారు. ఈ క్రమంలో ఆయన ’సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. ఈ ఘటనను ప్రధాని మోదీతో సహా పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, న్యాయవాదుల సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





