– ఏవోయూ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగష్టు 9: ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ(Adivasi) అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు డాక్టరు బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar open univrsity) వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడిరచారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా చదువుకు దూరమైన లక్షలాది మందికి గత నాలుగు దశాబ్దాల్లో ఉన్నత విద్యావకాశాలు చేరువ చేశామన్నారు. లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించినా వారిలో ఎవరున్నారు అని కాక ఏయే వర్గాల వారు లేరో విశ్వవిద్యాలయం పరిశోధించిందన్నారు. కొన్ని వర్గాలు, తెగలు ఇంకా చదువుకు దూరంగా ఉన్నాయనేది వెల్లడయిందని ఆయన తెలిపారు. అందులో ముఖ్యంగా ఆదివాసీ తెగలు ఉన్నత విద్యలో అత్యంత వెనుకబడి ఉన్నారని విశ్వవిద్యాలయం గుర్తించి వారికీ ఉన్నత విద్యను అందించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్
ఓపెన్ యూనివర్సిటీ బహుజన బడి. 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు. అందులో సగం మహిళలు చదువుతున్న విశ్వవిద్యాలయం. అయినప్పటికీ వారిలో కొన్ని వర్గాల విద్యార్థులు తగినంత కనిపించలేదు. తెలంగాణలోని ఆదివాసీ తెగలు తగినంతగా ఉన్నత చదువుల్లోకి రాలేదని గమనించి వారి కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనేది విశ్వవిద్యాలయం నినాదం. దానికి అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో కూడా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆదివాసీలకు చేరువకాలేక పోయామని విశ్వవిద్యాలయం గమనించింది. వారి చదువుకు కావాల్సిన వనరులు సమకూర్చడానికి ప్రయత్నించాలని భావించింది. విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు దేశంలోనే అత్యంత తక్కువ ఫీజు. ఏడాదికి రూ. 3200 మాత్రమే వసూలు చేస్తున్నది. కానీ అడవి బిడ్డలకు అది కూడా భారమే, కావున వారికి ఫీజు లేకుండా చదువు చెప్పాలని భావించి ‘ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళిక’ను ప్రారంభించింది. రాష్ట్రంలోని గోండు, కోయ, చెంచు తదితర తెగల అడవి బిడ్డలకు అండగా నిలవడం, వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో ఎలాంటి బోధన రుసుము లేకుండా కేవలం రూ.500ల నామమాత్రపు అడ్మిషన్ ఫీజుతో ఉచితంగా చదువు చెప్పడం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రవేశంతో పాటు, పుస్తకాలు, ఇతర దృశ్య శ్రవణ వనరులు వారికి సమకూర్చి రాబోయే ఐదేళ్ళలో కనీసం వెయ్యిమంది ఆదివాసీ పిల్లలను పట్టభద్రులుగా నిలబెట్టాలన్నది విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో వివరించింది. ఈ విద్యాసంవత్సరం 2025-26 నుంచి ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. ఇందులో చేరడానికి ఆగష్టు 13 చివరి తేదీ. పూర్తి వివరాలకు హెల్ప్ డెస్క్ 040-23680333/040-23680555, కాల్ సెంటర్ :1800 5990 101 లేదా వెబ్‌సైట్‌లో www.braou.ac.in | www.online.braou.ac.in. చూడవచ్చు.





