– గతంలో ఫిరాయింపులను మరచిన బీఆర్‌ఎస్
– విూడియా సమావేశంలో మండపడ్డ అద్దంకి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. దీనిపై ఎవరికి వారు వక్ర భాష్యాలు చెబుతున్నారన్నారు. సీఎల్పీ విూడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సభా హక్కులను కాపాడేది స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ బీఆర్‌ఎస్ నాయకులు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో వారు చేసిన ఫిరాయింపుల గురించి మాట్లాడాలని నిలదీశారు. బీఆర్‌ఎస్ నాయకులు ముందు సుప్రీంకోర్టు తీర్పును చదవాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల సభ్యులను తమ పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌ది అని, అధికారంలో ఉన్న పదేళ్లూ వారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. సీఎల్పీ నేతగా ఒక దళిత నేత ఉంటే సహించలేక కేసీఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీల అంతం చూడాలని కేసీఆర్ ప్రయత్నించగా తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించామన్నారు. గతంలో అక్రమాలకు పాల్పడి సమర్థించుకోవడం బీఆర్‌ఎస్ నేతలకే దక్కిందన్నారు. ప్రతిపక్ష హోదా ఉన్నా అసెంబ్లీకి రాని కేసీఆర్‌పై తాము కోర్టుకు వెళ్లాలా అని నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని దయాకర్ తెలిపారు. ఇలాంటి వారు చట్టాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.



