త‌మిళ రాజ‌కీయాల్లో విజ‌య్ తుపాను!!

     ఇండియా కూట‌మిలో అత్యంత విశ్వ‌స‌నీయ పార్టీ ఏదైనా వున్న‌దంటే అది డీఎంకే మాత్రమే. అయితే బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో మాదిరిగానే అంప‌శ‌య్య‌పై కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కాస్త ఆక్సిజ‌న్ అందిస్తున్నది కూడా స్టాలిన్ పార్టీనే. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అల‌య‌న్స్ తో అధికారాన్ని చేప‌ట్టిన స్టాలిన్‌, ఈ పార్టీ వారికి మంత్రిప‌దవులు ఇవ్వ‌లేదు. ఇది కాంగ్రెస్ నాయ‌కుల్లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. నిజం చెప్పాలంటే డీఎంకే లేక‌పోతే కాంగ్రెస్‌కు మ‌నుగ‌డే లేదు! ఈ నేప‌థ్యంలో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు నేరుగా టీవీకేతో మంత‌నాలు నెర‌పుతున్నారు.

వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌రుగనున్న త‌రుణంలో త‌మిళ రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. ఎవ‌రికి వారు త‌మ ఉనికిని కాపాడుకునే య‌త్నంలో సాగుతున్న ఈ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు దెబ్బ‌తిన్న‌ది అన్నాడీఎంకే.  జ‌య‌లిత మ‌ర‌ణానంత‌రం జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల్లో త‌న‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా వున్న ప‌న్నీర్ సెల్వంను బ‌ల‌హీన ప‌ర‌చి ప‌ళ‌నిస్వా మి త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోగ‌లిగారు. ఎట్ట‌కేల‌కు ప‌న్నీర్ సెల్వంను 2022లో పార్టీనుంచి బ‌హిష్క‌రించారు. ప్ర‌స్తుతం ఈయ‌న విజ‌య్ పార్టీ టీవీకేలో చేరే అవ‌కాశాలున్న‌ట్టు ధ్రువీక‌రించ‌ని వార్త‌లు వెల్ల‌డిస్తున్నాయి. కూట‌మి భాగ‌స్వామి అయిన దిన‌క‌ర‌న్ కూడా విజ‌య్ వైపు మొగ్గు చూపుతుండ‌టంతో బీజేపీ నేత‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ఈవిధంగా ఎన్టీఏ కూట‌మిలో కొన‌సాగుతున్న లుక‌లుక‌లు, రాష్ట్రంలో క్ర‌మంగా కాలూనుకుందామ‌నుకుంటున్న బీజేపీకి త‌ల‌నొప్పిగా మారాయి. ఈ నేప‌థ్యంలో ప‌న్నీర్ సెల్వాన్ని, ఈనెల 3న హోం మంత్రి అమిత్‌షా పిలిపించి మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స‌మీక‌ర‌ణ‌ల‌పై వీరిమ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా ఇప్పుడు క‌ల‌హాల కుంప‌ట్ల‌లో కుత‌కుత‌లాడుతున్న ఏఐడీఎంకేను ఏక‌తాటిమీదికి తెస్తే త‌ప్ప అధికార డీఎంకేను ఒడించ‌డం సాధ్యంకాద‌ని ప‌న్నీర్ సెల్వం కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ట‌! గ‌తంలో ఇదే అభిప్రాయంతో ఏఐడీఎంకే సీనియ‌ర్ నేత కె.సెంగుట్ట‌య‌న్ కూడా విభేదాల‌తో త‌ల‌మున‌క‌లుగా ఉన్న పార్టీ నేత‌ల‌కు ఏక‌తాటిమీద‌కు తీసుకురావాల‌ని య‌త్నించి సాధ్యం కాక‌ విజ‌య్ నేతృత్వంలోని టీవీకేలో చేరి త‌న‌దారి తాను చూసుకున్నారు. సెంగుట్ట‌య‌న్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బ‌ల‌మైన నేత‌.
ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ఎన్డీఏ కూట‌మిలో మూడు గ్రూపులు కొన‌సాగుతున్నాయి. ఒక‌టి ఏఐడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎడిప్పాడి ప‌ళ‌నిస్వామి, రెండ‌వ‌ది అమ్మ మ‌క్క‌ల్ మున్నేట్ర క‌జ‌గం (ఏఎంఎంకే) అధినేత  టీటీవీ దిన‌క‌ర‌న్ కాగా మూడ‌వ‌ది ప‌న్నీర్‌సెల్వం గ్రూపు.  2017లో ఏఐడీఎంకే నుంచి బ‌హిష్కృతుడైన దిన‌క‌ర‌న్ ఏఎఎంఎకే పార్టీని స్థాపించారు. 2024లో ఎన్డీఏ కూట‌మిలో చేరారు. ఇక ప‌న్నీర్ సెల్వం కూడా ఏఐడీఎంకే నుంచి 2022లో బ‌హిష్కృతుడ‌య్యారు. కాగా ప‌సుప్ప‌న్ ముత్తురామ‌లింగం తేవార్ (ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు) జ‌యంతి సంద‌ర్భంగా ప‌న్నీర్ సెల్వం, టీటీవీ ద‌యానిధి మార‌న్‌ల‌ను సెంగుట్ట‌య‌న్ క‌లిసారు.  ఇందుకు ఆగ్ర‌హించిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ళ‌నిస్వామి ఆయ‌న్ను పార్టీనుంచి బ‌హిష్క‌రించ‌డం త‌ర్వాతి ప‌రిణామం. బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే ఈ నాయ‌కుల‌ను క‌లిసి పార్టీ ఐక‌మ‌త్యం కోసం కృషిచేసాన‌ని త‌ర్వాత సెంగుట్ట‌య‌న్ వివ‌ర‌ణ ఇచ్చినా ఫ‌లితం లేదు. త‌ర్వాత న‌వంబ‌ర్ 26న ఏఐడీఎంకేకు రాజీనామా చేసి, టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. ఐదు ద‌శాబ్దాలుగా ఏఐడీఎంకేతో బ‌ల‌మైన అనుబంధం క‌లిగిన ఈ 77 సంవ‌త్స‌రాల నాయ‌కుడు, యువ‌ర‌క్తంతో నిండిన టీవీకేలో ఏవిధంగా ఇమ‌డ‌గ‌లుగుతార‌న్న‌ది కాల‌మే చెప్పాలి. ఇన్ని గ్రూపు త‌గాదాల మ‌ధ్య ఏఐడీఎంకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏవిధంగా డీఎంకేను ఎదుర్కొంటుంద నేది ప్ర‌శ్నార్థ‌క‌మే! ఇదిలావుండ‌గా ప‌ళ‌నిస్వామితో విభేదాల‌తో ఏఐడీఎంకేకు గ‌త సెప్టెంబ‌ర్‌లో రాజీనామా చేసిన ఏఎంఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర‌న్‌ను విజ‌య్ పార్టీ వైపున‌కు మొగ్గు చూప‌వ‌ద్దంటూ బీజేపీ నేత‌లు బుజ్జ‌గిస్తున్నారు. తాను ఎన్డీఏ కూటమిలో వుండాలంటే ఏఐడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా వుండ‌టానికి వీల్లేద‌ని తెగేసి చెబుతున్నారు. కూట‌మి ప‌రంగా చూస్తే 2026 ఎన్నిక‌ల్లో డీఎంకేను ఓడించ‌డానికి దిన‌క‌ర‌న్ స్ట్రైక్‌రేట్ చాలా కీల‌క‌మ‌న్న సంగ‌తి బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌కు బాగా తెలుసు. ఈ నేప‌థ్యంలో ఈ నెలాఖ‌రులోగా అమిత్ షా చెన్నై చేరుకొని కూట‌మిలో కొన‌సాగుతున్న లుక‌లుక‌ల‌ను స‌రిచేసే అవ‌కాశ‌మున్న‌దంటున్నారు. అంతేకాకుండా విజ‌య్ నేతృత్వంలోని టీవీకే పార్టీ వైపున‌కు పోకుండా దిన‌క‌ర‌న్‌ను ఆయ‌న ఒప్పించ‌గ‌ల‌ర‌న్న ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గ్రూపుల కొట్లాటల్లో త‌ల‌మున‌క‌లుగా వున్న ఏఐడీఎంకేతో జ‌ట్టుక‌ట్టిన బీజేపీ ఇప్ప‌డు నిజంగా అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్న‌ద‌నే చెప్పాలి.
కూట‌మి రాజ‌కీయాల మాట అట్లా వుంచితే  వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌తంలో కంటే మ‌రింత ప‌నితీరు ప్ర‌ద‌ర్శించాల‌ని బీజేపీ త‌ప‌న‌ప‌డుతోంది. ముఖ్యంగా పార్టీ నేత‌ల్లో కీల‌క ఎమ్మెల్యే వ‌న‌తి శ్రీ‌నివాస‌న్ గ‌తంలో తాను పోటీచేసిన కోయంబ‌త్తూరు ఉత్త‌ర స్థానానికి మారే అవకాశాలున్నాయంటున్నారు. ఈమె గ‌త ఎన్నిక‌ల్లో కోయంబ‌త్తూరు-ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి ప్ర‌త్య‌ర్థి ఎంఎన్ ఎం పార్టీ అధినేత, ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ‌ల్ హ‌స‌న్‌ను 1728 ఓట్ల తేడాతో ఓడించారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఏఐడీఎంకే-బీజేపీ అల‌య‌న్స్ కోయంబ‌త్తూరు ప్రాంతంలో మొత్తం ప‌ది అసెంబ్లీ స్థానాల‌ను స్వీప్ చేసింది. కాగా రాష్ట్ర బీజేపీ మాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై ఇదే కోయంబ‌త్తూరు ప్రాంతానికి చెందిన ప‌ల్ల‌దాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయ‌వ‌చ్చంటున్నారు. కానీ ఇప్ప‌టికే ఆయ‌న‌కు పార్టీ ప‌రంగా అనేక కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో త‌ల‌మున‌క‌లుగా వున్నారు. ఇక పూర్వ కేంద్ర‌మంత్రి పొన్ రాధాకృష్ణ‌న్‌, తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై, క‌రైకుడి మాజీ ఎమ్మెల్యే హెచ్‌. రాజా త‌దిత‌రులు అధినాయ‌క‌త్వం నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక‌వేళ త‌మిళ‌నాడులో గ‌ణ‌నీయంగా స్థానాల‌ను మెరుగుప‌ర‌చు కుంటే దీని ప్రభావం ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బ‌లీయంగా వుంటుంద‌ని ఇక్క‌డి నాయ‌కుల అభిప్రాయం. మ‌రో బీజేపీ కురువృద్ధురాలు స‌ర‌స్వ‌తి (80) ప్ర‌స్తుతం మొద‌కురుచ్చి స్థానంనుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ఈ స్థానంపై ఏఐడీఏంకే క‌న్నేయ‌గా, ఆమె మాత్రం త‌న కోడ‌లు కీర్తిక శివ‌కుమార్‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని ఇప్ప‌టినుంచే ప‌ట్టుప‌డుతున్నారు. ఇక చెన్నైలోని టి.న‌గ‌ర్‌, వేలాచెర్రి, మైలాపూర్ స్థానాల కోసం బీజేపీ నాయ‌కుల్లో గ‌ట్టి పోటీ క‌నిపిస్తోంది.
ఇండియా కూట‌మిలో అత్యంత విశ్వ‌స‌నీయ పార్టీ ఏదైనా వున్న‌దంటే అది డీఎంకే మాత్రమే. అయితే బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో మాదిరిగానే అంప‌శ‌య్య‌పై కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కాస్త ఆక్సిజ‌న్ అందిస్తున్నది కూడా స్టాలిన్ పార్టీనే. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అల‌య‌న్స్ తో అధికారాన్ని చేప‌ట్టిన స్టాలిన్‌, ఈ పార్టీ వారికి మంత్రిప‌దవులు ఇవ్వ‌లేదు. ఇది కాంగ్రెస్ నాయ‌కుల్లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. నిజం చెప్పాలంటే డీఎంకే లేక‌పోతే కాంగ్రెస్‌కు మ‌నుగ‌డే లేదు! ఈ నేప‌థ్యంలో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు నేరుగా టీవీకేతో మంత‌నాలు నెర‌పుతున్నారు. అఖిల భార‌త ప్రొఫెష‌న‌ల్ కాంగ్రెస్ చీఫ్ ప్ర‌వీణ్ చ‌క్ర‌వ‌ర్తి ఈనెల 5న చెన్నైలో విజ‌య్‌ను క‌లవ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఈయన రాహుల్ గాంధీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. అదీకాకుండా విజ‌య్ తాను అధికారంలోకి వ‌స్తే కాంగ్రెస్ వారికి త‌గిన అవ‌కా శాలు క‌ల్పిస్తానంటూ వూరించ‌డం త‌మిళ కాంగ్రెస్ నేత‌ల్లో ఆశ‌లు రేపుతోంది. ఇదిలావుండ‌గా అంత‌కుముందు కాంగ్రెస్ సీట్ల పంప‌కాల ఇన్‌చార్జ్ గిరీష్ చంద‌న్‌కుమార్‌, ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో మంత‌నాలు జ‌ర‌ప‌డం మ‌రో ప‌రిణామం. బ‌లం లేక‌పోయినా, ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే కాంగ్రెస్‌ను డీఎంకే అధినేత ఖాత‌రు చేసే ప‌రిస్థితి లేదు.  క‌ద‌ల‌లేని స్థితిలో వున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీని న‌మ్ముకుంటే బిహార్ ఎన్నిక‌ల్లో కూట‌మికి ప‌ట్టే గ‌తే ప‌డుతుంద‌న్న సంగ‌తి స్టాలిన్‌కు బాగా తెలుసు. అదీకాకుండా కాంగ్రెస్ త‌న‌పై ఆధార‌ప‌డాల్సిందే త‌ప్ప మ‌రో మార్గాంత‌రం లేదు. అందువ‌ల్ల కాంగ్రెస్‌ను ఆయ‌న ఖాత‌రు చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లను స‌రిదిద్దేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగిన‌ట్టు చెబుతున్నారు. గ్రూపు రాజ‌కీయాల్లో ముక్క‌లు చెక్క‌లై వుండి బ‌ల‌హీన‌ప‌డిన ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి ఏఐడీఎంకేను తేలిగ్గా మ‌రోసారి మ‌ట్టి క‌రిపించ‌వ‌చ్చ‌న్న ధీమాతో స్టాలిన్ ముంద‌డుగు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *