కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: ఫోన్ ట్యాపింగ్ కేసులో దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు. కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది, కొంతమంది మీడియా సంస్థల యజమానులు తనపై వ్యక్తిగతంగా, తమ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారన్నారని ఆరోపించారు. అలాంటి వారు కానీ, వారు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు కానీ తనపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వల్ల తమ కుటుంబ సభ్యులపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్నాయని,. మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు తన శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులకు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.





