– ఈ నెల 26 నుండి జూలై 24 వరకు
– బోనాలు నిర్వహణకు రూ.20కోట్లు మంజూరు
– అందరికీ తెలిసేలా ప్రచారం
– అధికార్లు సమన్వయంతో పనిచేయాలి
– మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
ఈనెల 26 నుండి జూలై 24 వరకు నిర్వహించు ఆషాడ మాస బోనాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ పొన్నం ప్రభాకర్,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసిహెచ్ఆర్డి తుంగభద్ర బ్లాక్ లో ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ , రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు.
ఉత్సవాలు ఈనెల 26 నుండి ప్రారంభమై జూలై 24 వరకు నిర్వహిస్తారన్నారు. ఈనెల 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 13న రంగం( భవిష్యవాణి) కార్యక్రమం, జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20న సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనాలను నిర్వహిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందన్నారు. వీటిల్లో 9దేవాలయాల్లో మంత్రులు, 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఏనుగు అంబారీ ఊరేగింపు జూలై 14న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో,20 న శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం సబ్జీ మండి, జూలై 21న అక్కన్న మాదన్న దేవస్థానం ఉంటుందని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన దేవాలయాల వద్ద రోడ్లకు మరమ్మత్తులు చేపట్టవలసిందిగా, దేవస్థాన పరిసరాలు పరిశుభ్రంగా, హైజనిక్ గా ఉండేలా శానిటేషన్ పనులు చేపట్టాలని, దేవాలయాల చుట్టూ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.
భక్తులకు సురక్షిత మంచినీరు అందించాలని, నీటి ప్యాకెట్లు పంపిణీ చేయాలని, ప్రధాన ఆలయాల వద్ద నేటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్ బి అధికారులను, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, దేవాలయాల వద్ద భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఐసిడిఎస్ సహకారంతో అందించాలని మంత్రులు సూచించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందుగా దేవాలయాల్ని సందర్శించి తదుపరి ప్రణాళిక ప్రకారం సిబ్బందితోపాటు ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.





