లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు డీఎస్పీలు మృతి

చౌటుప్పల్‌, ప్రజాతంత్ర, జులై 26: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్‌ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీలు చక్రధర్‌రావు(57), శాంతారావు(54), అడిషనల్‌ ఎస్పీ కోకా రాంప్రసాద్‌ తదితరులు విధి నిర్వహణలో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పోలీసు కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్‌ నర్సింగ్‌రావు, ఏఎస్పీ రాంప్రసాద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన డీఎస్పీలు ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ హోంశాఖ మంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *