ఈ ఉప ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్,ఇటు తెలంగాణ రాష్ట్రలలో రాజకీయాల ముసుగు తొలగి పోనుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రలలో ప్రదాన ప్రతిపక్షాలు అయిన బిఆర్ యస్, వైయస్సార్ సిపి పార్టీలకు తమకు అనుకూలమైన మంచి నిర్ణయం ఆచితూచి తీసుకునే అవకాశం వచ్చినా, కేంద్రంలో ఉన్న బిజేపికి భయపడుతున్న పరిస్థితి వాటి మాటల్లో,నిర్ణయాల్లో బహిర్గతం అవుతుంది. ఇక ఆంద్రప్రదేశ్ లో బిజేపి కూటమిలో భాగస్వామి గా ఉండడంతో పాటు, అధికారంలోకి వచ్చిన మరుసటి క్షణం నుండి వైయస్ఆర్ సిపి ని బలహీన పరిచే రాజకీయ క్రీడ ఆడుతున్నా ఎందుకో జగన్మోహన్ రెడ్డి బిజేపి ని బలంగా అట్టి పెట్టుకొని ఉండాలనే ప్రయత్నంనే చేస్తున్నాడు.

(రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, రచయిత,సామాజిక కార్యకర్త)
సెల్:9441864514. ఇమెయిల్: thirmal.1960@gmail.com
ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయ భవిష్యత్తు చిత్రపటాన్ని ఆవిష్కరణ చేయనుంది.అటు జాతీయ రాజకీయాలు,ఇటు తెలుగు రాజకీయ డొల్ల తనాన్ని బయటపెట్టుకుంటూ, దేశరాజకీయ యవనికపై సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకనుంది. గత పదకొండేళ్ళుపైగా దేశంలో కొనసాగుతున్ననిరంకుశ రాజకీయాలపై పోరాటం కు మూలమలుపు సైతం కానుంది. ఎన్డీఏ, ఇండియా కూటమి పార్టీలు రెండు పక్షాలు దక్షిణాది రాష్ట్రాల కు చెందిన అభ్యర్థులనే రంగంలోకి దింపారు, నిర్ణయాలు వ్యూహాత్మకమే అయినా సైద్ధాంతికంగా చూసినప్పుడు అభ్యర్థులలో అభ్యర్థిని నిలిపిన తాత్వికత లోకూడా భిన్నత్వం గోచరిస్తూంది. ఎన్ డి ఏ రాష్ట్ర పతి అభ్యర్థి గా తమిళనాడుకు చెందిన రాధాకిష్ణన్ , ఇండియా కూటమి నుండి బరిలో దిగిన, తెలంగాణాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గాని ఇక్కడ వ్యక్తిగత పోటీ అనుకుంటే పొరపాటు అవుతుంది. రెండు పెద్ద కీలక సైద్ధాంతిక వ్యవస్థల మధ్య పోరు అనక తప్పదు..ఒక దేశ ప్రధాని ఎర్రకోట మీదనే నేరుగా నాది ఆర్ ఎస్ ఎస్ జెండా, సంఘ్ పరివార్ ఎజెండానే అని ప్రకటించిన తర్వాత జరుగుతున్న కీలక ఎన్నిక ఇది.
బిజేపి ఇప్పటికే ఏడాది కాలంగా రాజ్యసభలో తన బలాన్ని స్థిరీకరించుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని చేసింది. ఆంద్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన వైయస్ఆర్ సిపిని బలహీన పర్చడం కోసం పలువురు యంపిలతో రాజీనామా చేయించి అక్కడ బలం లేకపోయినా తన ఖాతాలో వేయించుకున్న చాణక్యం చూసిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలో సైతం రాజకీయ బెదిరింపులు, ఎత్తుగడలు ఉండవని గ్యారంటీ ఏమీలేదు.. ఇప్పటికే ఈ దిశగా ఇండియా కూటమి రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టు లో ఇచ్చిన సల్వాజుడుం తీర్పును కేంద్ర మంత్రి అమిత్ షా వక్రీకరించి చేసిన వ్యాఖ్యానం దుమారం లేపింది. రాష్ట్రపతి అభ్యర్థిని వామపక్ష వాదిగా ముద్రవేయడం ద్వారా రైటిస్టు వోటర్లను ఆకర్షించే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా విమర్శలను తిప్పికొట్టడంలో ఇండియా కూటమి అభ్యర్థి సఫలం కావడమే కాక తాను ఏ రాజకీయ పక్షానికి చెందని రాజ్యాంగ పరిరక్షణ విధిగా వచ్చానని ఆయన పేర్కొన్నారు. ఒకరకంగా అమిత్ షా ఈవిషయంలో బూమరాంగ్ అయ్యారు. బిజేపి సంఘ్ పరివార్ మూలాలు ఉన్న వ్యక్తిని వెతికి మరీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఎన్డీఏ పక్షాన పోటీ చేయిస్తే మద్యేవాది, శుద్ద ప్రజాస్వామ్య వాది, రాజ్యాంగ విలువలకు గౌరవం ఇచ్చే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి రంగంలోకి దింపింది. గెలుపోటములు ప్రక్కన పెడితే దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు,కరుడుగట్టిన మత రాజకీయాలకు మధ్య ఉపరాష్ట్రపతి ఎన్నిక సమరశంఖం పూరించినట్లే!
ఈ ఎన్నిక లోక్ సభ ,రాజ్యసభ పక్షాల ఎలెక్టోరల్ కాలేజీ వోట్ల తో నడిచేది కనుక పడే వోట్లలో రాజకీయంగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చును. ప్రజా అబిప్రాయం కు కూడా దర్పణం పట్టక పోవచ్చును, కానీ, దేశ భవిష్యత్తును, రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలనుకున్న పార్లమెంటు సభ్యులకు , వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం కు ఇది చక్కని అవకాశం. బిజేపి గత పదకొండేళ్ళుగా మన రాజ్యాంగ స్ఫూర్తి మీదనే దృష్టి పెట్టి తమ భావజాలం అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను మార్చుకొంటూ , సవరించుకుంటూ వచ్చింది. యన్ఆర్ సి, జమ్ముకాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు, ఇండియన్ పీనల్ కోడ్లను మార్చి న్యాయస్మృతి ,న్యాయసహితలుగా నామకరణం చేయడం, ఎన్నికల కమిషనర్ కొలీజియం లో మార్పు, రైతులు, కార్మికులు విషయంలో తెచ్చిన నూతన చట్టాలు, రాజ్యాంగ సంస్థలు అయిన సిబిఐ,ఇడి,ఐటి, ఎన్నికల సంఘం లను తమ గుప్పిటలోనికి తెచ్చుకొని ప్రత్యర్థులపై ప్రయోగం చేస్తున్న తీరు,ఇప్పుడు 30దినాలు రిమాండ్ లో ఉన్న ముఖ్యమంత్రులు ను తొలగించే బిల్లు ఇవన్నీ కూడా బిజేపి అధికారం నుండి అధికారం స్థిరపర్చుకునే దిశగా వేస్తున్న అడుగులే..! అంతేకాదు,తనతో ఉన్న,లేని రాజకీయపక్షాలను సైతం తోలుబొమ్మలుగా చేసుకొని ఆడిస్తున్న స్థితి స్వాతంత్ర్య భారతదేశంలో తొలిసారిగా రాజకీయ యవనికపై చూస్తున్నాం.
అందువల్ల ఈ ఉపరాష్ట్రపతి ఎంపిక రాజకీయ పక్షాలు సైద్ధాంతిక పునాది తోపాటు, వాటి రాజకీయ డొల్లతనాన్ని స్పష్టంగా బయట పెట్టనుంది.ఒకరకంగా దేశంలో రాజకీయ చిత్రపటంలో గొప్ప సైద్ధాంతిక యుద్ధం రెండు కూటములు మద్య 9వ తేదీన జరగబోతుంది.ఈదశలో రాజకీయాలుకతీతంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు నిలబడాలని, రాజ్యాంగ స్ఫూర్తి ని కాపాడుకోవాలని భావించిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు సభ్యులు ఆత్మగౌరవం కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి వోటేసే చక్కని అవకాశం వచ్చింది. కాసేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వోటు వేసే ముందు ఆత్మను సాక్షాత్కరించాలసిన సమయం మన పార్లమెంటు సభ్యుల మనోఫలకం ముందుకువచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపియం లాంటి జాతీయ పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి మద్దతు ప్రకటించాయి. డీఎంకే,త్రుణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్, శివసేన, సమాజ్ వాదీ , ఝార్ఖండ్ ముక్తిమోర్చాలాంటి కీలక ప్రాంతీయ పార్టీలు మద్దతు ఆయనకు ప్రత్యక్షంగా లభించనుంది. ఇక పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా బీజు జనతాదళ్,బిఆర్ యస్, వైయస్ఆర్ సిపి తదితర చిన్నాచితకా పార్టీలు నిర్ణయాలు తమ సంకట స్థితిని బట్టి ఎలావున్నా,దేశభవిష్యత్ రాజకీయ చిత్రపటం ను మార్చడంలో ఆయా పార్టీలు సభ్యులు ఆత్మగౌరవం దిశగా ఆలోచన చేయాల్సిన సమయం ముందుకు వచ్చింది.
బహిర్గతం కానున్న తెలుగు రాష్టరాజకీయ రంగులు
ఈ ఉప ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్,ఇటు తెలంగాణ రాష్ట్రలలో రాజకీయాల ముసుగు తొలగి పోనుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రలలో ప్రదాన ప్రతిపక్షాలు అయిన బిఆర్ యస్, వైయస్సార్ సిపి పార్టీలకు తమకు అనుకూలమైన మంచి నిర్ణయం ఆచితూచి తీసుకునే అవకాశం వచ్చినా, కేంద్రంలో ఉన్న బిజేపికి భయపడుతున్న పరిస్థితి వాటి మాటల్లో,నిర్ణయాల్లో బహిర్గతం అవుతుంది. ఇక ఆంద్రప్రదేశ్ లో బిజేపి కూటమిలో భాగస్వామి గా ఉండడంతో పాటు, అధికారంలోకి వచ్చిన మరుసటి క్షణం నుండి వైయస్ఆర్ సిపి ని బలహీన పరిచే రాజకీయ క్రీడ ఆడుతున్నా ఎందుకో జగన్మోహన్ రెడ్డి బిజేపి ని బలంగా అట్టి పెట్టుకొని ఉండాలనే ప్రయత్నంనే చేస్తున్నాడు. మిగిలిన నాలుగేళ్ళు తాను ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోవాలంటే పరోక్షంగా నైనా బిజేపి మద్దతు కావాలని ఆయన కోరుకుంటున్నట్లున్నారు. ఒకవైపు నిర్దాక్షిణ్యంగా అణచివేసేస్తున్నా ఆయన తిరిగి బిజేపి వైపే చూస్తున్న విచిత్ర పరిస్థితి.
అధికారపక్షంలో ఉన్న టిడిపి తమ డొల్ల సిద్ధాంతాన్ని మరోమారు బయట పెట్టుకోబోతుంది. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పుట్టింది తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో ,ఆ మేరకు ఆయన ప్రత్యర్థి రాజకీయ పక్షం అయిన పివి నరసింహారావు ను ఏకగ్రీవంగా గెలిపించే ప్రయత్నం చేశారు. అది ఆయన చిత్తశుద్ధి. కానీ, అదే తెలుగు దేశం నేత చంద్రబాబు నాయుడు లో ఆ దమ్ము, దైర్యంలేదు ఫక్తు అవకాశవాదరాజకీయ వాది! రాజకీయాలుకువాడుకునే కులవాది కూడానూ..వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి గా పోటీచేసిన సందర్భంలో తెలుగు ఆత్మగౌరవం సాక్షిగా రాజకీయాలు కతీతంగా ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు .ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విషయంలో తెలుగు ఆత్మగౌరవం ఎటు పోయింది? చంద్రబాబు పైకి ఎన్ని చెప్పినా ఆయన తొలి నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్డీయే రాజకీయాలు బలపరుస్తూ వచ్చారు. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చినా ప్రతిసారీ ఆయన అదే పని చేశారు.రేపు బేషరతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్న బిజెపి అభ్యర్థికే కూటమి ధర్మం పేరుతో మద్దతు ప్రకటిస్తారు కూడా! ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పక్షాలైన తెలుగు దేశం, వైయస్సార్ సిపి లు ప్రజల ముందు తమ అనైతిక రాజకీయ విలువలు ఎలా ప్రదర్శించుకుంటారో మరోసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చూడబోతున్నాం.
ఇక పోతే తెలంగాణా రాజకీయాలలో పరిస్థితి మరింత దయానీయంగా మారింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్యే వాది అయిన జస్టస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం ఆపార్టీ నైతికత ను పెంచింది.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడినా,గెలిచినా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణా రాష్ట్రం లో గొప్ప నైతిక బలం,విజయంగా చెప్పవచ్చును. ఈ ఎన్నిక ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కి పెద్ద రాజకీయ అగ్నిపరీక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైతే ఈవిషయంలో మద్దతు కోరడానికి కేసీఆర్ ఫాంహౌస్ కైనా వెళ్తానని తిరుగులేని రాజకీయ ప్రకటన చేశాడు. బంతి కేసీఆర్ కోర్టులో వేశారు. ఇక కేటీఆర్ అందుకు స్పందించిన తీరు తన రాజకీయ అజ్ఞానం,అపరిపక్వతను మరోసారి బయట పెట్టింది. ముఖ్యమంత్రిని దూషిస్తూ ,ఆయన పెట్టిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అని మాట్లాడడం ఆయన అపరికత్వతను, రేవంత్ రెడ్డి పై గుడ్డి ద్వేషంతో పాటు, బిజెపి కి పరోక్షంగా సంకేతం పంపినట్లు అయ్యింది..! అయితే, బిజేపి తెలంగాణా కీలక నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాము బి ఆర్ ఎస్ మద్దతు కోరుకోవడం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.
ఈ చర్యతో బి ఆర్ ఎస్ ప్రతిష్ట మరింత దిగజారింది. గత కొంత కాలం గా స్వయానా సోదరి కల్వకుంట్ల కవిత బి ఆర్ ఎస్ పార్టీ బిజేపి విలీనం కోసం ప్రయత్నాలు చేసింది అని చేసిన ఆరోపణలు బలపర్చేలా కేటీఆర్ స్పందన ఉంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక లో సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే సైద్ధాంతిక నిబద్ధతకు కట్టుబడి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి లా బిజెపి భయానికి, భవిష్యత్తు వ్యూహం కు లొంగిపోతారా? అనేది బి ఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు రాజకీయ అగ్నిపరీక్ష నే..! అయితే, కేటీఆర్ వ్యాఖ్యలు ఎలావున్నా అంతిమంగా కేజ్రీవాల్ దౌత్యం తోనైనా కేసీఆర్ నిర్ణయమే ఆపార్టీ నిర్ణయం కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపే ఆయన ఉద్యమ పార్టీ వైఖరిగా మోగ్గుచూపే అవకాశం ఉంది. ఏది ఎలావున్నా ఉభయ తెలుగు రాష్ట్రలలో ఆయా రాజకీయ పార్టీలు రాజకీయ రంగులు వెలిసి పోయోస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక బహిర్గతం చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయం అనేది దేశంలో సెక్యులర్, రాజ్యాంగ విలువలకు అద్దం పట్టడంతోపాటు, నిరంకుశ రాజకీయ విధానాలకు చెంప చెళ్ళుమనిపించే ఫలితాలు రావాలని ఆకాంక్షిద్దాం! మన తెలుగు బిడ్డ, తెలంగాణా తేజం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని రాజకీయాల కతీతంగా ఆలోచిద్దాం. ఆదిశగా వోటు వేయాలని మన పార్లమెంటు సభ్యులు ఆత్మ ప్రబోధం ను ఆకాంక్షిద్దాం…





