నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం లేదు. కాకపోతే అవసరమైనప్పుడు ఉపయోగపడే ఒక ఉత్తమ కస్టమర్‌ను పోగొట్టుకోవడం ఇష్టంలేక చేస్తున్నది. తనను తాను విశ్వగురువుగా చెప్పుకుంటున్న వారు షాపింగ్‌లో నైతికతను పక్కన పెట్టేయడం గమనార్హం. దీనివల్ల దిల్లీలో వాహనాలు నిరాటంకంగా తిరుగుతాయేమో కానీ, ప్రపంచ నాయకత్వ స్థాయి నుంచి భారత్‌ను కేవలం ఇన్‌వాయిస్‌లకు సంబంధించిన కార్పొరేట్ ఆడిటర్ స్థాయికి దిగజారుస్తుంది. దీన్నే “శవాల మీద పేలాలు ఏరుకునే” దౌత్యమని అంటారు!”

“అన్యాయ పరిస్థితులు నెలకొన్నప్పుడు నువ్వు తటస్థ వైఖరి అనుసరించా వంటే, అణచివేత దారుడిని సమర్థిస్తున్నట్టే”, ఆర్చిబిషప్ డెస్మండ్ టూటూ చేసిన హెచ్చరిక ఇది. అన్యాయాన్ని ఎదుర్కొనడంలో తటస్థ వైఖరి అనుసరిస్తే అది పీడితుడికి సహాయపడినట్టు కాదు. బాధితుడి గొంతుపై కత్తి పెట్టిన  పీడకుడికి మద్దతు పలికినట్టు. ఒకపక్క పశ్చిమాసియా అగ్నిగుండంగా మారిన తరుణంలో భారత్ ఈ హెచ్చరికను విస్మరించి, ఇతరుల బాధను పట్టించుకోకుండా తన ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హోర్ముజ్ జలసంధి నుంచి పుష్పక్, కమల్ అనే పేరుగల మనదేశ రెండు చమురు నౌకలు సురక్షితంగా రావడాన్ని ప్రస్తుతం ప్రభుత్వ అనుకూల మీడియా ఒక గొప్ప ధైర్యసాహసం గా ప్రచారం చేస్తోంది. న్యూస్ యాంకర్లు ఎంతగా గొంతు చించుకున్నా, ఈ రెండు నౌకలు భారత్‌కు సురక్షితంగా చేరుకోవడం వెనుక, దౌత్యపరమైన విజయం కంటే మన రెండు నౌకలను హోర్ముజ్ జలసంధి “జైలు”నుంచి ఇరాన్ వెళ్లగొట్టిందని భావించాలి. నిజం చెప్పాలంటే ఇరాన్ తీసుకున్న మంచి తెలివైన నిర్ణయం ఇది. అంతేకాదు తమ పాఠశాలలపై క్షిపణితో దాడి చేసి అమాయకులైన పిల్లల దుర్మరణానికి కారణం అమెరికా, ఇజ్రాయిల్‌లన్న సంగతి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్న భారత్ నయవంచన దౌత్యనీతిని ఇది బహిర్గతం చేసింది .

    కొన్నేళ్లుగా పరిశీలిస్తే, యు.ఎస్. ఇరాన్‌పై కన్నెర్ర జేసినప్పుడల్లా భారత్, ఆ దేశంనుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తూ రావడాన్ని గమనిస్తున్నాం . ఇది కేవలం యు.ఎస్. విధించే ఆంక్షల భయంతో తీసుకున్న నిర్ణయం మాత్రమే. 2019-25 మధ్యకాలంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించినప్పుడల్లా భారత్ ఏవిధంగా తన చమురు కొనుగోలును తగ్గిస్తూ వస్తోందో పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు యు.ఎస్, ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది.  ఈ నేపథ్యంలో మన దేశం మిత్రులైన పశ్చిమ దేశాలను సంతుష్టులను చేయడానికి మౌనాన్ని ఆశ్రయిస్తోంది. ఈ దేశాలను అసంతృప్తికి గురిచేయడం మనదేశానికి ఎంతమాత్రం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం. మరి తటస్థంగా ఉన్నానంటున్న భారత్ అదే వైఖరిని కొనసాగించకపోవడం  మరో విడ్డూరం.
    గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మనదేశం అనుకూలంగా వోటు చేసింది. అయినా మిత్రుడా బాధపడకు అన్నటుంది. ఇదేం తటస్థ వైఖరి? ఇక్కడ మన స్వాతంత్య్రం అనేది పశ్చిమ దేశాల అనుమతిపై ఆధారపడిందనేని సుస్పష్టం. మెట్లమీద నుంచి కింద పడిన పిల్లవాడికి, వాడు కింద పడ్డాడన్న సంగతి తెలిసీ, తెలియనట్టుగా నటిస్తూ ఒక చాక్లెట్ ఇవ్వజూపిన చందంగా, ఇరాన్‌తో మన దౌత్య వ్యవహారశైలి నడుస్తోంది. ఇప్పుడు మన దేశానికి చమురు రావడానికి అనుమతించడం ద్వారా మన “వ్యూహాత్మక స్వేచ్ఛను” ఇరాన్ అపహాస్యం చేస్తున్నది. భారత్ ఈ ప్రపంచానికి నేతృత్వం వహించడంలేదు: ఈ చమురు నౌకల విడుదల ఎట్లాంటిదంటే, తనపక్కనే నిప్పంటుకున్నప్పుడు క్యూ లైన్‌లో ఉన్న  ఒక చిన్నపిల్లవాడిని లైన్ నుంచి తప్పుకొని ముందుకెళ్లడానికి అనుమతించిన చందమేనని చెప్పాలి.
    ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఇరాన్‌కు వ్యతిరేకంగా కఠిన పదజాలంతో ప్రవేశపెట్టిన తీర్మానానికి, బుద్ధిమంతుడైన విద్యార్థి టీచర్ ఆదేశాలను పాటించిన రీతిలో మన దేశం మద్దతు పలికింది. అంతేకాదు, ఇరాన్ పూర్తిగా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని, ఆ దేశ వ్యవహారశైలి ప్రపంచ శాంతికి భంగకరంగా ఉన్నదని మనదేశం స్పష్టంగా పేర్కొంది. “మీరేం చేశారో ఒక చోట కూర్చొని ఆలోచించండి” అని కోరింది. ఇప్పుడు మళ్లీ తన నైతిక నిష్టను కాస్తంత పక్కన పెట్టి ఇరాన్ తలుపు తడుతోంది. ముఖ్యంగా తన నౌకలకు వీఐపీ పాస్ కావాలని కోరుతోంది. నిజానికి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు యదేచ్ఛగా క్షిపణులను ప్రయోగించడం భారత్ దృష్టిలో ప్రపంచశాంతికి భంగకరం కాదు. అదే చమురు ట్యాంకర్‌కు ఒక చిన్న పగులు ఏర్పడినా అది ఘోర తప్పిదం. ఇది దౌత్య నీతిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం తప్ప మరోటి కాదు. ఒకపక్క తన పొరుగువాడిని ఖండిస్తూనే మరోపక్క చమురు ట్యాంకర్లను స్వదేశానికి రప్పించుకోవడానికి వారినే షార్ట్‌కట్ మార్గం అడగడం పరిణామాత్మక టావోయిజంలో ఒక అద్భుతమైన మాస్టర్ పీస్‌గా భావించాలి.
నువ్వు చెప్పడానికేమీ లేనప్పుడు ఏదో ఒకవైపుకు అనుకూలంగా వ్యవహరించకూడదు. కానీ మన అదృష్టమేమంటే, ఎవరినైతే మనం మోసగిస్తున్నామో వారే మన నౌకలను సురక్షితంగా మన దేశానికి పంపుతున్నారు. క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్  తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ,  తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం లేదు. కాకపోతే అవసరమైనప్పుడు ఉపయోగపడే ఒక ఉత్తమ కస్టమర్‌ను పోగొట్టుకోవడం ఇష్టంలేక చేస్తున్నది.  తనను తాను విశ్వగురువుగా చెప్పుకుంటున్న వారు షాపింగ్‌లో నైతికతను పక్కన పెట్టేయడం గమనార్హం. దీనివల్ల దిల్లీలో వాహనాలు నిరాటంకంగా తిరుగుతాయేమో కానీ, ప్రపంచ నాయకత్వ స్థాయి నుంచి భారత్‌ను కేవలం ఇన్‌వాయిస్‌లకు సంబంధించిన కార్పొరేట్ ఆడిటర్ స్థాయికి  దిగజారుస్తుంది.  దీన్నే “శవాల మీద పేలాలు ఏరుకునే” దౌత్యమని అంటారు!
-శామ్ సుందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *