ప్రతీ పేదవాడికి ఇల్లు

తల తాకట్టు పెట్టైనా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాం..
ములుగు జిల్లాకు మరో వెయ్యి ఇండ్ల మంజూరు
-రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి
పేద కుటుంబాల‌కు  గూడు, పౌష్టిక హారం అందించడమే లక్ష్యం
త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి : మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించడమే లక్ష్యమ‌ని గత పాలకులు చేసిన అప్పులను తీర్చుకుంటునే తల తాకట్టు పెట్టయినా అప్పులను తీర్చుతూ సంక్షేమ ఫలాలను అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ప్రతి పేద కుటుంబానికి గూడుతో పాటు పౌష్టిక హారం అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నదని, అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా పర్యాటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మంత్రి  సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లకు భద్రాచలం  ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్ పి శబరీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్  రవి చందర్  తదితరులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఇంచర్ల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి సీతక్క త‌దిత‌రులు 23 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

 

అనంతరం ఇంచర్ల ఎంఆర్ ఫంక్షన్ హాలు లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..  రాష్ట్రంలోని  ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్లతో  4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు.  గతంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసిందన్నారు. గత పదేళ్లుగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లో నిర్మించి ఇస్తామని పేదలకు సాకులు చెప్పి కేవలం 93 వేల ఇండ్లకు టెండర్లను పిలిచి 60 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసిందని, గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందమైన బొమ్మలు చూపుతూ రెండుసార్లు  వోట్లను దండుకొని అధికారంలోకి వొచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని, ములుగు నియోజకవర్గానికి  3 వేల ఇండ్లు మంజూరు కాగా ఐటీడీఏ కు మరో 1500 ఇండ్లు మంజూరయ్యాయని, తాను మరో వెయ్యి ఇండ్లను మంజూరు చేస్తున్నానని హామీ ఇచ్చారు.

ప్రతి గ్రామంలో విడతల వారీగా ఇండ్లను మంజూరు చేస్తామ‌న్నారు. మొదటి దశలో ఇండ్లు మంజూరు కాని వారు నిరాశ చెందవద్దని సూచించారు. లబ్ధిదారులకు  వెంటనే ఉచితంగా ఇసుక కోసం కూపన్లను అందజేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు సైతం ఇండ్ల నిర్మాణ పనులను అడ్డుకోవద్దని అన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని పనుల పురోగతిని బట్టి ప్రతి సోమవారం చెక్కులను అందిస్తామ‌ని తెలిపారు. రానున్న ఎన్నికలలో ప్రజలు తమకు అండగా ఉండాలని కోరారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి పేదలకు డబల్ బెడ్ రూమ్ లు అందిస్తామని మోసం చేశారని, నేడు ఇందిరమ్మ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడంతో దానిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు దుష్పప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాను పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాంతంగా మార్చడానికి నిధులు కేటాయించామ‌ని 70 కోట్లతో రామప్పలో పనులు చేపట్టడమే కాకుండా
30 కోట్లతో ఐలాండ్ అభివృద్ధి పనులు చేస్తున్నాని అన్నారు. ప్రతి మహిళ మహిళా సంఘాలలో చేరి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొంది పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఇక్కడి ప్రాంతంలోని మహిళలకు ఇతర ప్రాంతాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్ పై శిక్షణ శిబిరాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి అనసూయ సీతక్క ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నార‌ని,ములుగు జిల్లాలోనే మా నియోజకవర్గంలోని రెండు మండలాలు కూడా జిల్లాతో పాటు అభివృద్ధి చెందుతున్న‌ద‌ని అన్నారు. ఇంతవరకు ఏ మంత్రి వెళ్ళని మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాలోని టేకులగూడెం అనే  చిన్న ప్రాంతంలో కూడా స్వయంగా మంత్రుల ద్వారా ఇందిరమ్మ గృహాల శంకుస్థాపన జరగడం ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. తాగునీటికి కోసం కష్టపడే ఏజెన్సీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేవలం నూట నలభై గృహాలు ఉన్న చిన్న గ్రామానికి కూడా ప్రత్యేక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ గ్రామానికి నీరు అందించిన ఈ ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాను కూడా ఇందిరమ్మ గృహంలోనే విద్యను అభ్యసించానని , అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రతి పేదవారకి  ఇందిరమ్మ గృహాలు అందుతున్నాయని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గలో 4500 గృహాలు మంజూరు అయ్యాయని తెలిపారు.  కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ మంజూరు, ఆయిల్ పా ఫ్యాక్టరీని ప్ర‌భ‌త్వం మంజూరు చేసింద‌ని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ములుగు జిల్లాకు అత్యధికంగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 720 ఇందిరమ్మ గృహాలను పైలెట్ గ్రామాలలో నిర్మాణం మొదలు పెట్టామని, వాటిలో 613 గృహాలకు గ్రౌండింగ్ కూడా పూర్తయిందని, 400 గృహాలు బేస్మెంట్ స్టేజ్ పూర్తయిందని , వాటిలో 300 గృహాలకు బేస్మెంట్ బిల్ లక్ష రూపాయలు అందించామ‌ని పేర్కొన్నారు.

ఎంపీ  పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వంలో ములుగు జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, అన్నారు. అటవీ గ్రామాలకు రహదారుల నిర్మిస్తామ‌ని, ములుగు కేంద్రంగా ఏర్పాటవుతున్న గిరిజన యూనివర్సిటీకి ప్రహరీ బిల్లు కూడా మంజూరు అయ్యిందని తెలిపారు. 800 కోట్లతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో పేద ప్రజలు అభివృద్ధి చెందేలా కృషిచేస్తున్నామ‌ని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *