నీటి విష‌యంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

– మొద్దునిద్ర పోతున్న ప్ర‌భుత్వం
– విప‌క్షంగా మేం నిల‌దీస్తే త‌ప్ప క‌ద‌లిక లేదు
– రాష్ట్ర నీటి హక్కుల‌ను హ‌రించేందుకు ఏపీ ప‌క్కా స్కెచ్‌
– చంద్ర‌బాబుకు రాష్ట్రాన్ని రేవంత్ తాక‌ట్టు పెట్టారా?
– ఏపీ ప్ర‌భుత్వం ట్రిబ్యున‌ల్‌ను ధిక్క‌రిస్తోంది
– ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16: సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిరంతరం శ్రమించారు.. కృష్ణా జ‌లాల్లో నష్టాన్ని పూడ్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్ సాధించి నీటి పునఃపంపిణీ జరిగేలా చూశారు.. గోదావరిలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న హక్కులను శాశ్వతంగా కాపాడారని శాస‌న స‌భ‌లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీష్‌రావు తెలిపారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో సోమ‌వారం ఆయ‌న మాట్లాడారు. గోదావరిలో ఉన్న 1400 టీఎంసీల నీటిలో 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. మన 968 టీఎంసీల హక్కులను స్థిరపరచడానికి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి 400 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు సాధించిన ఘనత కేసీఆర్ దేన‌న్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ ఇప్పుడు ఆదమరిచి నిద్రపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతకానితనాన్ని ఆసరాగా చేసుకుని గోదావరి జలాలపై పడింది. తాము ప్రతిపక్షంగా నిలదీసిన ప్రతిసారీ ఉలిక్కిపడి లేచి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోంది.. బహుశా ఈరోజు తాను ప్రెస్ మీట్ పెట్టి అడిగాను కాబట్టి సాయంత్రానికి మళ్లీ ఏదైనా లేఖ రాసే డ్రామా ఆడుతుందేమోన‌న్నారు. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం ద్వారా తెలంగాణ నీటి హక్కులను హరించేందుకు ఏపీ పక్కా స్కెచ్ వేసింద‌ని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని గోదావరి నీళ్లను దోచుకునేందుకు టీడీపీ ప్లాన్ చేసిందన్నారు. గోదావరిలో ఏ రాష్ట్రానికీ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గమ‌న్నారు. ఢిల్లీ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12నే రాష్ట్రానికి వచ్చాయి.. ఈరోజు మార్చి 16. నెల రోజులు దాటిపోయినా అందులో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా? లేక దాసోహం అయ్యారా అని ప్ర‌శ్నించారు.  గోదావరి, బనకచర్ల అంశాలు ఎజెండాలో లేకపోతేనే ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తామని ముందు చెప్పిన ఈ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం పోలవరం, నల్లమల్ల సాగర్ అంశాలను ఎజెండాలో పెట్టినా కూడా మోకాళ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్లి మీటింగ్‌లో కూర్చుందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను చైర్మన్‌గా చేసి దొంగ చేతికే తాళాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమ‌న్నారు. మీటింగ్ మినిట్స్ పేజీ 3లో రాష్ట్రాల మధ్య గోదావరి జలాల కేటాయింపులు అసలు లేవని ఏపీ స్పష్టంగా చెప్పినట్లు ఉంది. దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదంటే తెలంగాణకు వాటా లేదని అంగీకరించినట్టే కదా అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకపోతే గోదావరిపై పలు రాష్ట్రాలలో సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు. ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎక్కడిది? ఏపీ సర్కార్ ట్రిబ్యునల్‌ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ హక్కులను కాలరాయడమేనన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చాం.. అప్పుడు ఏపీకి 531 టీఎంసీల వాటా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సీతారామ ప్రాజెక్టుకు (67 టీఎంసీలు) సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. జూన్ 2023లో సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టులో గోదావరిలో 3396 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఏపీ వాటా పోను మిగిలినవన్నీ తెలంగాణవేనని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు ఏపీ ఏకంగా 775 టీఎంసీలు కావాలని కొట్లాడుతోంది. కృష్ణాలో కనీసం 34 శాతం తాత్కాలిక వాటాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతోంది. బీఆర్ఎస్ హయాంలో 18 టెలిమెట్రీలు ఏర్పాటు చేశాం. కానీ, వాటి నిర్వహణ కోసం ఇచ్చిన రూ.4.5 కోట్లను కేఆర్ఎంబీ అధికారులు తమ జీతాలకు వాడుకుని, బ్రిజేష్ కుమార్ అవార్డు వచ్చేదాకా కొత్త టెలిమెట్రీలు పెట్టేది లేదని తేల్చిచెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ ప్రసంగిస్తూ నల్లమల్ల సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి పనులు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. మరి తెలంగాణ గవర్నర్ స్పీచ్‌లో నల్లమల్ల సాగర్‌ను అడ్డుకుంటామని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకోమని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పించలేకపోయింద‌ని ప్ర‌శ్నించారు. కృష్ణాతోపాటు గోదావరి నీళ్లను కూడా ఏపీ దోచుకుపోకుండా ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే ఆ మీటింగ్ మినిట్స్‌పై గట్టిగా అభ్యంతరం తెలపాల‌ని హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని లేఖలు రాశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *