రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోంది

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– కాంగ్రెస్ దాడుల్లో గాయపడిన వారికి పరామర్శ

నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల పాశవిక దాడిలో గాయపడి నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను బుధవారం పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చండూరు మున్సిపాలిటీలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు తమ అనుచరులతో కలిసి బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఈ దాడిలో ఆరుగురు కార్యకర్తలకు తీవ్ర గాయాలవ్వగా ప్రస్తుతం నలుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గతంలో చండూరు మున్సిపాలిటీలో బీజేపీ¾ తరపున పోటీ చేసిన కిరణ్‌పై రాజకీయ కక్షతో స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయన్నారు. బాధితులకు కనీసం హాస్సిటల్‌లో సరైన సమయానికి వైద్యం అందకుండా కూడా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఇంత తీవ్రమైన ఘటన జరిగినా పోలీసులు నిందితులపై కఠిన సెక్షన్లు పెట్టకుండా సాధారణ కేసులు నమోదు చేసి సరిపెట్టారని, పైగా బాధితులైన బీజేపీ కార్యకర్తలపైనే కౌంటర్ కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తున్నదనడానికి ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు. పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ వంటి అనేక ప్రాంతాల్లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బీజేపీ నాయకులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ¾ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై ఒక డీఎస్పీ చేయిచేసుకోవడం అత్యంత దారుణమన్నారు. కాంగ్రెస్ నాయకులు భూ ఆక్రమణలు, డ్రగ్స్, లిక్కర్, బెల్ట్ షాపుల దందాలను యథేచ్ఛగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వారు కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు భయపడొద్దని, బాధితులకు సరైన వైద్యం అందించాలని కోరుతున్నామన్నారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల అరాచకాలను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ మీకు పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దోషులకు శిక్ష పడే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *