సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, 3: మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో బీసీ గురుకులాలు, హాస్టల్స్ లో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 593 మార్కులు తెచ్చుకున్న దుర్గాభవాని, 590 మార్కులు తెచ్చుకున్న శివాని, 580కి పైగా మార్కులు సాధించిన 31 మంది, 570 పైన మార్కులు తెచ్చుకున్న 216 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వారి ప్రాంతానికి రాష్ట్రానికి పేరు తెచ్చారని అభినందించారు. బీసీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారని మంచి బోధన అందిస్తున్నఅధ్యాపకవర్గాన్ని కొనియాడారు. పదో తరగతి పరీక్షల్లో 17 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే వందల్లోనే 570 కి పైగా మార్కులు వొచ్చాయని అన్నారు. మీ దగ్గర నుంచి మంచి ఫలితాలు రావాలని, విద్యార్థులు పాస్ మాత్రమే కాకుండా మంచి ర్యాంకులు వొచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు.
ఉపాధ్యాయులకు రావలసిన బెనిఫిట్స్ సంస్థ తరుపున ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని తెలిపారు. ఈ అకాడమీ నుంచి 140 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత శాతం ఉందని, మిగిలిన స్కూల్ లో ఎందుకు తక్కువ వొచ్చిందో సమీక్షించుకోవాలన్నారు. సంవత్సరంలో 300 రోజులు పిల్లలు ఉపాధ్యాయుల వద్దనే ఉంటారని, వారు పేరెంట్స్ కంటే ఎక్కువ గురుకులాల్లోనే మీ దగ్గరే ఉంటారని, వారిలో మంచి చదువు నైపుణ్యాలు అందించాలన్నారు. ట్రెక్కింగ్ , సెయిలింగ్ పోటీలకు కూడా వారికి నైపుణ్యాలు అందిస్తున్నామన్నారు.
గతంలో చదువుకోవడానికి వసతులు లేవని మారుతున్న కాలానికి అనుగుణంగా తిండి లేకున్నా.. మంచి చదువు అందించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని అన్నారు. మీరంతా పోటీ ప్రపంచంలో నెగ్గేలా విధానపరమైన మార్పులను అవగతం చేసుకోవాలని ప్రభుత్వం పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం అందించడానికి 40 శాతం మెస్ చార్జీలు . 200 శాతం కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం పెంచిందని అన్నారు. విద్యార్థులు రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి. రేపటి తెలంగాణ భవిష్యత్తుకు మీరే మార్గదర్శకులుగా కావాలి. చదువు, ఆటలు, ఇతర నైపుణ్యాల్లో మంచి ప్రతిభ కనబరచాలని భవిషత్ లో మనం ఏం కావాలని అనుకుంటున్నామో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆదిశగా ముందుకు పోవాలన్నారు. విద్యకే పరిమితం కాకుండా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుడాలని, గురుకులాల్లో ట్రెయిన్డ్ టీచర్స్ మంచి పరీక్షలు రాసి ఉద్యోగంలో వొచ్చిన వారు ఉన్నారు.
ఏ గురుకులాల్లో కూడా ఖాలీ స్థానాలు ఉండకూడదు.. అన్ని స్కూళ్లలో 100 సీట్లు నిండాలని, అన్ని గురుకులాలు పోటీ పడి మాకు అందులోనే సీటు రావాలని విధంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించనుందని, ఇప్పటికే 58 స్కూళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు , వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంత్రి శాలువా, మెమెంటో, సర్టిఫికెట్ లతో మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్,కమిషనర్ బాల మాయాదేవి , గురుకుల సెక్రటరీ సైదులు ,ఎమ్బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లయ్య భట్టు, సిఈఓ అలోక్ కుమార్, వసతి గురువాహాల అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





