పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులకు దీటైన జవాబు

తిప్పికొట్టిన భారత ఎస్-400, ఆకాష్ క్షిపణి వ్యవస్థలు

న్యూదిల్లీ, మే 8: ఐఏఎఫ్ స్థావరాలు, రాడార్ కేంద్రాలు లక్ష్యంగా పాకిస్తాన్ చేసిన దాడి యత్నాన్ని భారత వాయు రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి.  పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ తన దాడులను పెంచే యత్నంలో బుధవారం రాత్రి భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు, ఇతర హింసాత్మక ఆయుధాలను ప్రయోగించింది. కానీ భారత వాయు రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా ఎస్-400, ఆకాష్, అనేక కౌంటర్-యూఏఎస్ వ్యవస్థలు, ఈ ప్రయత్నాన్ని సమర్థంగా తిప్పికొట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భారత ఏర్ ఫోర్స్ స్థావరాలు ఉన్న పఠాన్‌కోట్, శ్రీనగర్ సహా 15 ప్రధాన స్థలాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి పాక్ డ్రోన్లు, క్షిపణుల రూపంలో  జరిగింది. పాకిస్తాన్ వైమానిక దళాలు (ఎయిర్‌క్రాఫ్ట్‌లు) ఈ దాడిలో పాల్గొనలేదని కానీ భారీ సంఖ్యలో డ్రోన్లు, మ్యూనీషన్లు పంపినట్టు సమాచారం.

భారత రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం పాకిస్తాన్ మనదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్థల, జాలంధర్, లుధియానా, ఆదంపూర్, బథిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లై, భుజ్ లోని మిలిటరీ టార్గెట్లను లక్ష్యంగా చేసుకుంది   ఈ దాడుల్లో లొయిటరింగ్ మ్యూనీషన్లు ఆయుధాలతో నిండిన డ్రోన్లు వాడబడ్డాయి. వీటిని హ్యాండ్‌హెల్డ్, జామింగ్, స్పూఫింగ్ పరికరాలతో కూడిన కౌంటర్-యూఏఎస్ వ్యవస్థలు అడ్డుకున్నాయి.

పాకిస్తాన్ టార్గెట్లు – భారత ప్రతీకారం
పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నది ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ స్థావరాలు, రాడార్ కేంద్రాలు అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమ సెక్టార్‌లో వాయు రక్షణ వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ దాడికి ప్రతీకారంగా భారత్ కామికాజే డ్రోన్లు వాడినట్టు సమాచారం. వీటితో లాహోర్‌లోని వాయు రక్షణ వ్యవస్థను నాశనం చేసినట్టు భారత రక్షణ శాఖ తెలిపింది. అంటే భారత డ్రోన్లు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌ను అధిగమించి లాహోర్ వరకూ చొచ్చుకుపోయినట్టు స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *