ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అరాచ‌కాలు

– ఓట‌మి భ‌యంతోనే దాడులు
– అడుగ‌డుగునా అధికార దుర్వినియోగం
-వేధింపుల‌కు, దాడుల‌కు భారీ మూల్యం త‌ప్ప‌దు
– హామీల‌ను గాలికొదిలేసారు
– రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం మీదే
– పోలింగ్ అనంత‌రం మీడియాతో కేటీఆర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11:  మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన  అభినందనలు తెలిపారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పురపాలక సమరంలో గులాబీ సైనికులు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆయన కొనియాడారు. గత రెండేళ్ల పాలనలో ఘోరమైన వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో దౌర్జన్యకాండకు దిగారని కేటీఆర్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే రేవంత్ రెడ్డి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను, పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం ముఖ్యమంత్రిని ప్రతినిత్యం వెంటాడుతుందని ఎద్దేవా చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అంత‌టా అధికార దుర్వినియోగం: హ‌రీష్‌రావు

మాజీ మంత్రి, డిప్యూటీ  ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ము ఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గమ‌న్నారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్‌ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమ‌న్నారు. బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమ‌న్నారు. చట్టాన్ని సైతం లెక్కచేయకుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయమ‌న్నారు. కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేన‌న్నారు. కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవ‌న్నారు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషిచేసిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జ్‌లకు అభినంద‌న‌లు తెలిపారు. బీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *