వంద‌ రోజుల మైలు రాయి దాటిన ఆన్‌లైన్ డైలీ

– ‘సురక్ష’ ప్రత్యేక సంచికను ఆవిష్క‌రించిన డీజీపీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 7: తెలంగాణ పోలీస్‌ శాఖ అధికారిక గొంతుకగా, సిబ్బందికి సమాచార వారధిగా సేవలందిస్తున్న ‘సురక్ష’ ఆన్‌లైన్‌ డైలీ వంద‌ రోజుల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా శనివారం డిజిపి కార్యాలయంలో శతదినోత్సవ వేడుక జరిగింది. డీజీపీ బి.శివధర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ వంద రోజుల ప్రయాణంలో కృషి చేసిన సురక్ష ఎడిటర్ డాక్టర్ ఎం.రమేష్ ,బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ‘సురక్ష’ ప్రత్యేక సంచికను డిజిపి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ‘సురక్ష’ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ గా ఉన్న డిజిపి  బి.శివధర్‌ రెడ్డి  మాట్లాడుతూ తాను స్వయంగా ప్రారంభించిన సురక్ష ఆన్‌లైన్‌ డైలీ, వంద రోజుల వేడుకలోనూ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గతంలో మాసపత్రికగా ఉన్న సురక్ష వృత్తిపరమైన మెళకువలను అందించేదనీ , ఇప్పుడు డిజిటల్‌ రూపంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో ఉన్న సిబ్బందికి చెరువవుతున్న‌దన్నారు. సురక్ష పత్రిక మాత్రమే కాదు, మన శాఖ సమాచార వారధి అని , సమాచార మార్పిడిలో దీన్ని మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారుల , సిబ్బంది సలహాలను ప్రచురించడం ద్వారా, విధుల్లోకి కొత్తగా వస్తున్న యువ పోలీసులకు ఇది ఒక దిక్సూచిలా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సురక్ష ఆన్లైన్ డైలీ ప్రారంభించిన అనంతరం ఈ 100 రోజుల ప్రయాణంలో ఏ రకమైన అనుభవాలు ఎదురయ్యాయని డిజిపి అడిగి తెలుసుకున్నారు.
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ , సురక్ష ఎడిటర్‌ డాక్టర్‌ ఎం.రమేష్‌ మాట్లాడుతూ పత్రిక భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. శాఖలో అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది సేవలను గుర్తించడం, వారి మధ్య సమన్వయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ డైలీని తెచ్చామని , గత కొన్ని సంవత్సరాల నాటి సంకల్పం నేడు వంద రోజుల ప్రయాణానికి దోహద పడిందన్నారు. .త్వరలోనే ‘సురక్ష’ను సాధారణ దినపత్రికల తరహాలో అన్ని హంగులతో పూర్తిస్థాయి పత్రికగా తీర్చిదిద్దాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. డిజిపి సూచనల మేరకు సమాచార వారధిగా ఉన్న సురక్ష పత్రికలో మెరుగైన మార్పులు తీసుకువస్తామ న్నారు. వంద రోజుల వేడుకలో భాగంగా ‘సురక్ష’ను ప్రతి రోజు పాఠకుల ముందుకు తీసుకురావడంలో కృషి చేసిన నాంపల్లి శ్రీనివాస్‌ను డిజిపి సన్మానించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ యూనిట్లలో పనిచేస్తున్న పిఆర్‌ఓ లకు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పోలీస్ పి ఆర్ ఓ లు ఆన్‌లైన్‌ డైలీ రాకతో క్షేత్రస్థాయిలో తమకు కలిగిన అనుభవాలను పంచుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *