“అంతా బాగానే ఉంది కానీ… చివరి రెండ్రోజులు భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మేడారం నుండి పస్రాకు ఆరేడు గంటలు పట్టింది. బస్సయిన.. కారయిన అదే టైమ్. తప్పదు మరి. రోడ్ దిగి వేరే దారిలో వెళ్ళడానికి కూడా లేదు. రోడ్డుకు రెండు వైపుల చెట్లే. శుక్రవారం హన్మకొండలో బయలు దేరిన భక్తులు దాదాపు పది గంటల తరవాత మేడారం చేరుకోగలిగారు. తిరుగు ప్రయాణీకులు పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడికి పోయిందో తెలియదు. పోలీసు, ఆర్టీసీ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం భక్తుల ఇక్కట్లకు ప్రధాన కారణం. కొందరు పోలీసులు బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ క్లియర్ చేయించారు. అదీ కాసేపే. 5 నిమిషాల్లో మళ్లీ షరా మామూలే. కోట్లాది మంది భక్తుల వాహనాలను ఎలా నియంతించాలో తెలియక ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది.”
-వంగ మహేందర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్
మేడారం శ్రీ సమ్మక్క సారక్క మహా జాతర ముగిసింది. 4 రోజులపాటు కుంభమేలా తరహాలో జరిగిన గిరిజన జాతర ఆసియాలోనే అతి పెద్దది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు విదేశీయులు మేడారం జాతరకు తరలి వచ్చారు. నాలుగు రోజుల్లో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు వన దేవతలు సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుని ఉంటారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. 251 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించామని, పోలీసు, ఆర్టీసీ ఇతర విభాగాల సమన్వయంతో జాతరను ఇబ్బందులు లేకుండా నిర్వహించామని మంత్రి సీతక్క ప్రకటించారు. జాతర నిర్వహణ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొన్న మంత్రి సీతక్క చాలానే కష్టపడ్డారు. తాను మంత్రిని అనే విషయాన్ని పక్కన పెట్టేసి…జనంలో కలిసిపోయి సౌకర్యాల కల్పనతో పాటు భక్తుల ఇబ్బందులను అధికారుల ద్వారా తీర్పించ గలిగారు.
అంతా బాగానే ఉంది కానీ… చివరి రెండ్రోజులు భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మేడారం నుండి పస్రాకు ఆరేడు గంటలు పట్టింది. బస్సయిన.. కారయిన అదే టైమ్. తప్పదు మరి. రోడ్ దిగి వేరే దారిలో వెళ్ళడానికి కూడా లేదు. రోడ్డుకు రెండు వైపుల చెట్లే. శుక్రవారం హన్మకొండలో బయలు దేరిన భక్తులు దాదాపు పది గంటల తరవాత మేడారం చేరుకోగలిగారు. తిరుగు ప్రయాణీకులు పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడికి పోయిందో తెలియదు. పోలీసు, ఆర్టీసీ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం భక్తుల ఇక్కట్లకు ప్రధాన కారణం. కొందరు పోలీసులు బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ క్లియర్ చేయించారు. అదీ కాసేపే. 5 నిమిషాల్లో మళ్లీ షరా మామూలే. కోట్లాది మంది భక్తుల వాహనాలను ఎలా నియంతించాలో తెలియక ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. చుట్టూ జంగిల్, మధ్యలో వాహనాలు. అందులో భక్తులు…తాగడానికి నీళ్లు లేక, టాయిలెట్ వెళ్ళడానికి చోటు లేక మహిళలు పడిన అవస్త అంతా ఇంతా కాదు. చెట్లు మొదళ్లను చాటుగా చేసుకుని మహిళలు పురుషులు చూస్తుండగానే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందంటే… ఇంతకంటే అవమానకర విషయం మరోటి ఉంటుందా.
మంత్రి సీతక్క మహిళా అయి కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సరికదా కనీసం మాట వరసకు అయినా మహిళలు ఇబ్బంది పడ్డారు అని చెప్పక పోవడం విడ్డూరంగా ఉంది బస్సుల్లో ప్రయాణించిన భక్తుల పరిస్థితి ఇలా ఉంటే వీవీఐపీలు, విఐపి ల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. మేడారం నుంచి తాడువాయి వరకు అక్కడి నుండి తాడువాయి నుంచి పసరా వరకు రోడ్డు వెంట తాగునీటి సౌకర్యం కల్పించి ఉండాల్సింది. అలాగే టాయిలెట్లను ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కిందకే వస్తుంది. తాద్వాయి దగ్గర ప్రైవేటు వాహనాలను విఐపి ల వాహనాలను నిలిపివేయాలని ఆర్టీసీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్న విశ్లేషణ వినిపిస్తోంది. నిజానికి అది మంచి సూచన తాడువాయి చౌరస్తా పక్కనే దారికి రెండు వైపులా 10-10 అంటే మొత్తం 20 ఎకరాల చొప్పున పార్కింగ్ ప్లేస్లు చదును చేయించారు. అన్ని వాహనాలను అక్కడ నిలిపి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారంకు భక్తులను తరలించి ఉంటే ట్రాఫిక్ నియంత్రణలో ఉండేదని అంటున్నారు. వీఐపీ, ఆర్టీసీ బస్ ల కోసం తాడ్వాయి టు మేడారం డెడికేట్ చేశారు కానీ… విచ్చలవిడిగా జారీ చేసిన వీఐపీ ల పాస్ లతో ట్రాపిక్ కంట్రోల్ తప్పింది.
ఇక మేడారంలో బస్సులో దిగిన సామాన్య భక్తులు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన గద్దెల ప్రాంగణానికి వెళ్లాల్సి వచ్చింది. జంపన్న వాగుకు మరో కిలోమీటరు దూరం. ఆర్టీసీ బస్టాండ్ నుంచి గద్దెల ప్రాంగణం వరకు నాలుగు కిలోమీటర్లు. భక్తులు అమ్మవారికి సమర్పించే బంగారం నెత్తిన పెట్టుకొని వెంట తెచ్చుకున్న సామాన్లు, వంట పాత్రలు, బట్టలు మూట కట్టుకొని అమ్మవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. క్యూలైన్ల లో భక్తులు ఉండ గానే వీఐపీలు వల్ల సామాన్య జనం క్యూ కదలలేదని భక్తులు గగ్గోలు పెట్టారు. అది చాలాదన్నట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, గవర్నర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు వారి చుట్టూ ఉండే అనుచరులు సెక్యూరిటీ సమ్మక్క సారక్కలను గద్దల ప్రాంగణమంతా వారితోనే నిండిపోయింది. అసలు ఎన్ని వీఐపీ పాస్ లు ఇచ్చారో తెలియని పరిస్థితి. జంపన్న వాగులో స్నానాలు చేసి బట్టలు మార్చుకునేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏ మూలకు సరిపోలేదు. అక్కడ అంతా తడి, బురద మయం. పొడి దుస్తులు ధరించి దేవతల దర్శనం కోసం వస్తే కిక్కిరిసిన క్యూ లైన్లు భక్తులను ఉసూరుమనిపించాయి. నెట్టుకుంటూ…తోసుకుంటూ… గంట, గంటన్నర తర్వాత గద్దెల ప్రాంగణం లో అడుగుపెట్టిన భక్తులకు ఎటూ కదలలేని పరిస్థితి.
అమ్మవార్లు గద్దెల చుట్టూ ఉన్న వీఐపీ లు, గ్రిల్స్ వద్ద వాలంటీర్లు దడి కట్టిన పరిస్తితిలో తోసుకుంటూ ముందుకు వెళ్ళి బంగారం, చీర, సారే లను మూట కట్టి దేవతల గద్దెల పైకి విసిరేయడం తప్ప మరో మార్గం భక్తులకు లేకపోయింది. లోపల ఉన్న వీఐపీ లకు దెబ్బలు తగిలి హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నారు. అధికారులు చెప్పిన ప్రకారం మేడారంలో ఏర్పాటు చేసిన 30 పడకల హాస్పిటల్ లో ఇలా గాయ పడిన వారి సంఖ్య 2680. మానవ వ్యర్థాలు విసర్జన, కోళ్లు, గొర్రెలు, మేకల బలి, అపరిశుభ్ర వాతావరణంలో వండిన కలుషిత ఆహారం భుజించడం వల్ల హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న వారి సంఖ్య 1 లక్ష 86 వేల మంది అట. అంటే ప్రభుత్వం భక్తులకు ఎంత మెరుగైన సౌకర్యాలు కల్పించింది అనే విషయం అనారోగ్యం పాలయిన భక్తుల సంఖ్యను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉంటే తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ క్యూ లైన్లు ఏర్పాటు చేసింది.
అర కిలోమీటరు దూరం నడిచి టిక్కెట్లు తీసుకొని బస్సులో కూర్చున్న భక్తులకు 4 గంటలు గడిచినా దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయికి చేరుకోలేకపోయారు. అక్కడి నుండి పస్రాకు మరో మూడు గంటలు… అంటే..30 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం పట్టింది. ఇన్ని గంటలు తిండి తిప్పల సంగతేంటి.. ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది. దీనికి బాధ్యులు ఎవరు… ట్రాపిక్ జామ్ కారణాలు చెప్పాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను వివరణ కోరింది. అంతా బాగానే ఉంది… ఆరు రోజుల పాటు అటు పోలీసులు, ఇటు ఆర్టీసీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, విద్యుత్ సిబ్బంది, దేవాదాయ శాఖల అధికారులు, సిబ్బంది కష్ట పడ్డారు. వారి సేవలను తక్కువ చేయడానికి వీలు లేదు. ఎటొచ్చి సమస్య ఎక్కడ ఉత్పన్నం అయింది అన్నది తేలాలి. సమన్వయ లోపమే కారణం అన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు, నరక యాతన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.