– జాతరలో తప్పిపోయిన వారిని కనిపెట్టే సాధనం
– చిన్నారులు, దివ్యాంగులకు భద్రత
– ప్రారంభించిన డి.జి.పి శివధర్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల వెంట వచ్చే చిన్న పిల్లలు, దివ్యాంగులు ఒకవేళ తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే కనిపెట్టి, సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (సిటిఎంఎస్) రిస్ట్ బ్యాండ్లు అద్భుతంగా పనిచేస్తాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ సహకారంతో రూపొందించిన ఈ వినూత్న క్యూఆర్ కోడ్ ఆధారిత రిస్ట్ బ్యాండ్లను, సంబంధిత పోస్టర్లను ఆయన లాంచనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే మేడారం జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని వివరించారు. ఇంతటి భారీ రద్దీలో చిన్న పిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగులు తప్పిపోయే అవకాశం ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వారి భద్రతను పటిష్టం చేయడానికే ఈ సాంకేతికతను తీసుకొచ్చామని తెలిపారు.
ఎస్ఐబి ఐ జి పి బి.సుమతి గత ఒకటిన్నర నెలలుగా కష్టపడి ఈ విధానాన్ని సిద్ధం చేశారని, దీనిని రూపొందించడంలో వొడాఫోన్ యాజమాన్యం అందించిన సహకారం అభినందనీయమని కొనియాడారు. మహిళా భద్రత విభాగం డిజిపి చారుసిన్హా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జాతరలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా వంటి ఇతర భారీ ఉత్సవాల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని డిజిపి అభిప్రాయపడ్డారు. ఈ సీటీఎంఎస్ విధానం ద్వారా జాతరకు వచ్చే పిల్లలు, దివ్యాంగుల వివరాలను నమోదు చేసి వారి చేతికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్‌ను కడతారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లోని బృందాలు పిల్లల పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లను నమోదు చేస్తాయి. ఒకవేళ ఎవరైనా తప్పిపోయి కనిపిస్తే, అక్కడి వాలంటీర్లు లేదా పోలీసు సిబ్బంది తమ స్మార్ట్ఫోన్లతో ఆ బ్యాండ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. వెంటనే వారి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఫోన్ నంబర్లు, డయల్ 100 వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల తక్షణమే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, సురక్షితంగా అప్పగించే అవకాశం ఉంటుంది. అనంతరం వారు కుటుంబంతో కలిసిన ఫోటోను కూడా సిస్టమ్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ కార్యక్రమం కోసం మొత్తం 25,000 రిస్ట్ బ్యాండ్లను అందుబాటులో ఉంచారు. ఇవి ఈ నెల 27 నుంచి 31 వరకు 24 గంటల పాటు పనిచేసే 11 కేంద్రాల్లో లభిస్తాయి. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్‌లోని ఉప్పల్ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటు వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా భద్రత విభాగం, టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా క్యూఆర్ కోడ్ బ్యాండ్ ధరించిన వ్యక్తి ఒంటరిగా కనిపిస్తే వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిజిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిజిపి లు మహేష్ ఎం. భగవత్, చారుసిన్హా, డి.ఎస్. చౌహాన్, ఐజిపిలు చంద్రశేఖర్ రెడ్డి, బి.సుమతి, డాక్టర్ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





