“ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ప్రత్యేకముగా ఒక విషయాన్ని చెప్పాలి. ఏ ఆదివాసుల, మూల వాసుల చరిత్రను తరతరాలకు తెలుపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందో అంతే శ్రద్ధతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసుల హక్కులను అమలు చేయడానికి కృషి చెయ్యాలి. ఐదవ షెడ్యూల్ ఏరియాలో అమలు కావలసిన చట్టాలన్నీ పాలకుల చర్యలవల్ల నిర్వీర్యానికి గురవుతున్నవి. ఆదివాసి ప్రాంతాల్లో స్వయంపాలనకు ప్రతిరూపంగా చెప్పబడే పెసా గ్రామసభలు వారి సహజ వనరులను కాపాడుకోవడానికి కాకుండా పాలకుల ప్రయోజనాలకోసం చేతులెత్తే, బలవంతంగానైన చేతులెత్తించే సభలుగా మారిపోతున్నవి. విద్యా,ఉపాధి రంగాల్లో వారికోసం చేసిన చట్టాలు రద్దు చేయబడుతున్న ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ ఆదివాసి చట్టాల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటేనే మేడారం వంటి అభివృద్ధి చర్యల్లో ఆదివాసుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ నిజమని నమ్మాల్సి వస్తుంది. లేదంటే ఉత్త ప్రాయోజిత కాంక్ష చర్యలుగా చూడాల్సి ఉంటుంది.”
ఈ సారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు పున్నమి తనకు తాను కొత్త సొగసులు దిద్దుకుంటది. వనం జనం ఏదో విడదీయలేకుండా మెలిగే ఆ వీరమాతల చెంత చేరిన ప్రజల హృదయాల్లో ఇప్పుడు మేడారం కొత్త ముద్రను వేసి కలకాలం వారి చరిత్రను తలుసుకునే విధంగా నిలుస్తుంది. డోలు సప్పుళ్లు, కొమ్ము బూరల మోతలు, శివసత్తుల పూనకాలు, ఎత్తు బెల్లం బంగారాల మొక్కలు, ఎదురుకోళ్లు, జంపన్న వాగుల జలకాలు మాత్రమే చూసిన ఈ ప్రపంచానికి 2026 మేడారం జాతర ఒక కొత్త అనుభూతిని, అనుభవాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.జాతర అడుగున ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిమలు,వారి జీవన విధానాన్ని తెలిపే చిత్రాలు అన్ని మనల ముగ్ధుల్ని చేస్తాయి.మేడారం ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి పోయేకంటే కూడా ఈ సారి జాతర ఒక మ్యూజియం పోయినట్టుగా మేడారం ప్రారంభం నుండే ఆ అనుభూతి కలుగుతుంది. అక్కడ నిలపెడుతున్న ప్రతిమలు అన్నీ కూడా మన మనోఫలకం మీద కొత్త భావన చిత్రాలను గీస్తవి. ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన చరిత్రను సజీవంగా తెలుసుకునే అవకాశం కూడా అక్కడి రాతిపై చెక్కిన చిత్రాలు, సుందరీకరణకు ఏర్పాటు చేసిన కృత్రిమ బొమ్మలలో కూడా ఆ ఆదివాసీల అస్తిత్వం మనకు కనపడుతుంది.
అభివృద్ధి అనగానే పాలకుల దృష్టిలో ఎత్తెత్తు గోడలు, రంగుల బంగళాలు, రోడ్లు తప్ప ఏమీ కనపడవు. ఐతే ఆ అభివృద్ధిలో ప్రజల జీవితాల్లో మార్పులను తీసుకువచ్చేకంటే పాలకులు ఆశించిన లాభాలను తప్పక సాధించిపెట్టగలవు. ప్రత్యేకించి దర్శనీయ స్థలాల అభివృద్ధిలో కేవలం బంగళాలు, సౌకర్యాల కల్పన కోసం మాత్రమే కాకుండా ఆ ప్రాంతాల విశిష్ఠతను తెలిపేలా, ఆ చారిత్రక ప్రదేశాల చరిత్రను తరాలకు పరిచయం చేసేలా, ఆ ప్రజల ఆచార వ్యవహారాలు వారి చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేలా ఉండాలి. ముఖ్యంగా చరిత్ర అంటే బలవంతుల చరిత్ర మాత్రమే చరిత్రగా చలామణి అవుతున్న సందర్భంలో, ఆదిమ వాసుల, బహుజనుల మూలాలు చెరపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో సమాజం ఉన్నది. చరిత్రను వక్రీకరించి అధికారాన్ని నిలుపుకోవాలని పాలకులు భావిస్తున్న తరుణంలో మేడారంలో అభివృద్ధిలో భాగంగా నిలబెడుతున్న ఆదిమ జాతుల చరిత్ర, మూలవాసుల మూలాల ప్రతిష్టాపన అందరం ఆహ్వానించదగినది. హర్షించదగినది కూడా. ‘ చరిత్రను మరిచిపోయే వారు చరిత్రను నిర్మించలేరు ‘ అన్న అంబేడ్కర్ మహనీయుని మాటలను తలుచుకున్నపుడు మేడారంలో ఈ చరిత్రను నిర్మించడం తప్పనిసరి. నేడు వారి చరిత్ర, వారిదైన సంస్కృతి నిరాదరణకు పాలకుల చేతిలో అణచివేతకు గురవుతున్నపుడు ఆ ఆదివాసి సమాజానికి చెందిన వీరులు చేసిన యుద్ధంలో భాగస్వాములైన వివిధ తెగల చరిత్రను ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయా సమూహాలలో కొత్త శక్తి,ఒక స్ఫూర్తి తప్పక కలుగుతుంది. నేడు మేడారంలో అటువంటి చరిత్ర నిలబెడుతున్నారు.చూపెడుతున్నారు.
సమ్మక్క, సారక్క, పగిడిద్ద రాజు , జంపన్న తదితర వీరులు కాకతీయ రాజుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా తమ ప్రజల రక్షణకోసం ప్రాణత్యాగాలు పొంది నేడు కోట్లాది ప్రజల చేత ఆరాధించబడుతున్న చరిత్ర మనకు తెలుసు కానీ ఆ ప్రజల జీవన విధానం, వారి సంస్కృతి సంప్రదాయాలు తదితర విషయాలు పెద్దగా బయట సమాజానికే కాదు ఆ సమూహాలకు కూడా పూర్తిగా తెలియదు. చరిత్ర గమనంలో అక్షర జ్ఞానం లేని ఆదిమ తెగల చాలా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. అందుకు పాలకులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి వారి చరిత్రను మాత్రమే రాసుకుని, వారి చరిత్రను మాత్రమే చెక్కుకుని ఏండ్లుగా ఇదే అసలు చరిత్ర అని మభ్యపెడుతున్నారు. ఆదిమ తెగలను వారి వారి సంస్కృతి , సంప్రదాయాల నుండి వేరు చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివాసీ గూడాలలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు వెలువడం, చర్చీలు రావడం మనం గమనించవచ్చు. ఇదంతా ఆదివాసులను వారిదైన జీవితం నుండి పరాయీకరించడంలో భాగమే.
ఇప్పుడు మేడారంలో జరుగుతున్న చరిత్ర స్థాపన అనేది పైన చెప్పుకున్న అన్నిటికీ సమాధానంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాంస్కృతిక పునర్నిర్మాణంలో ఆదిమ జాతుల చరిత్ర , వారి ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు , వారి ఆరాధ్య దైవాల గురించిన పట్టింపు అంతగా లేదనే చెప్పుకోవాలి. ఆ మాటకు వస్తే కేవలం ఆదివాసుల దైవాలు మాత్రమే కాదు బహుజన జాతుల దైవాలకు సంబంధించిన క్షేత్రాల అభివృద్ధి గురించి నామమాత్రంగానే జరిగింది. పూర్తిగా మనువాద ఆలోచనల ప్రతినిధుల ఆలయాలు మాత్రమే అభివృద్ధి చేశారు. వారి చరిత్రను నిలుపుకునేందుకు మాత్రమే సహకరించారు అనేది తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొత్తాన్ని ఒకసారి మనసులోకి తెచ్చుకుంటే కనపడుతుంది. ఈ సందర్భంలో దశాబ్దాలుగా మేడారం అభివృద్ధి అంటే కూలిపోయిన స్నానఘట్టాలు, గుంతలు పడ్డ రోడ్లు, అధికారుల నివాసాల కోసం భవంతులు మాత్రమే కాదు ఆ ఆదివాసి ప్రజల చరిత్రను కూడా నిలబెట్టాలని అనుకోవడం హర్షించదగ్గ విషయం.
ఎవరి చరిత్రను వారే రాసుకోవాలని, అట్లా రాసుకున్న చరిత్రనే సాధికారికంగా ఉంటుందనేది చరిత్ర కారుల మాట. చరిత్రను గురించి నిర్వచించేటప్పుడు కేంబ్రిడ్జ్ చరిత్ర ఆచార్యుడు లార్డ్ ఆక్షన్ ‘ చరిత్ర మానవ స్వాతంత్ర్యాన్ని వివరించే గాథ’ గా నిర్వచించాడు. లార్డ్ ఆక్షన్ మాటలు మేడారం జాతరలో నేడు నిలబెడుతున్న చరిత్రకు సరిగ్గా సరిపోయే మాటలు. స్వయంపాలన కోసం, స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మనుషుల చరిత్ర చరిత్ర పొడుగునా కీర్తించబడుతుంది. ప్రజల చేత ఆరాధించబడుతుంది. నేడు మేడారంలో అటువంటి చరిత్రనే ఆ స్వాతంత్ర్య గాథనే నిలబడుతుంది.ఈ జాతర సమయంలో ఆ చరిత్ర ఆనవాళ్లను చూడటం సాధ్యం కాదు కానీ ప్రత్యేకించి ఆదిమ సమూహాల చరిత్రను కొత్తగా తెలుసుకోవాలనుకునే వారికి ఇప్పుడు మేడారం ఒక ప్రయోగశాల. ఈ దేశంలో ఉన్న చరిత్ర అంత మూలవాసుల శ్రమ మీద, వారిని అణచివేసి వారి ఆనవాళ్లను కూలగొట్టిన శిథిలాల మీద నిర్మించిన చరిత్రనే. క్రమేణ వచ్చిన పాలకులు కూడా వారి చరిత్రను కాపాడటానికి చర్యలు తీసుకున్నారు కానీ ఈ ఆదిమ చరిత్రను కాపాడటానికి అంతగా శ్రద్ధ చూపలేదు.
అందుకే మనకు ఆదివాసుల చరిత్ర విరివిగా లభ్యం కాకుండా పోయింది. ప్రచారంలో లేకుండా పోయింది. ఇప్పుడు మేడారంలో నిలబెట్టే ఈ వేలాది బొమ్మలు, గురుతులు ఒకనాటి ఆదిమ తెగల మొత్తం జీవనం, సంస్కృతి, పోరాటం అన్నిటిని కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. దానికి ఆ సమూహాలకు చెందిన పరిశోధక బృందాలే నాయకత్వం వహించి చరిత్రను నిలబెట్టడం ఒక ఎత్తు ఐతే మనం పాలకులం ఐతే మన చరిత్రను మనమే రాసుకోవచ్చు అనడానికి కూడా ఇది నిదర్శనం. ఆ సమాజం నుంచే వచ్చిన సీతక్క మంత్రిగా ఆ ప్రాంతం నుండే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ప్రత్యేక చొరవతో ఈ చరిత్రను రాసుకోవాలి, భవిషత్తు తరాలకు చూపించుకోవాలనే తలంపుతోనే ఇది సాధ్యమైంది. అధికార ప్రాయోజిత రాజకీయాలలో ఎవరున్నా వారి వారి ప్రయోజనాలు, లాభాలు ఆశించే పనులు చేస్తారు. కాదనలేని సత్యం అయినప్పటికీ మరుగునపడుతున్న చరిత్రను, నిరాదరణకు గురవుతున్న చరిత్రను బాహ్య ప్రపంచానికి అందించడానికి అభివృద్ధిలో దాన్ని భాగం చేసినందుకు వారిని అభినందించాల్సిందే.
ఐతే మేడారంలో ఇప్పుడు చరిత్ర నిలపెడుతున్నాం అన్నపుడు కొన్ని ఆసక్తులు కొన్ని అనుమానాలు ఉండటం సహజమే. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ పరిశోధక బృందం మీద ప్రభుత్వం మీద ఉన్నది. నిన్నటిదాకా మేడారంలో జరిపే పూజతంతు ఇవన్నీ వారివారి ఆచార, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు. ఇవి బయట సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా వారి సొంత విషయం. చాలా రహస్యంగా చేసే ఆ పూజలను, ఆ పూజారులను సమాజం చాలా గౌరవ భావంతో చూస్తుంది. కొలుస్తుంది కూడా. కానీ ఎప్పుడైతే అది చరిత్రగా నిలబడుతుందో ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలన్నీ బాహ్య సమాజానికి అందుబాటులో ఉంచాలి.
ఆ చారిత్రక ఆధారాలలో వాటిని కనుగొన్న స్థల కాలాలు, పురావస్తు ఆధారాలు, శాసన లేదా జానపద సాహిత్య ఆధారాలతో ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం కూడా ఉన్నది. అన్ని సార్లు పురావస్తు ఆధారాలు దొరుకకపోవచ్చు కానీ ఆధునిక చరిత్ర పరిశోధక ఆద్యుడుగా కొనియాడబడే డి.డి కోశాంబి పౌరాణిక గాథల నుండి (అంటే బ్రాహ్మణుల పురాణాల నుండి మాత్రమే కాదు పోచమ్మ, గంగమ్మ, ఆదివాసుల కథలు, మూలవాసుల జానపద గేయాలు తదితర గ్రామదేవతల గురించి ప్రచారంలో ఉన్న గాథలు కూడా) చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారని బాలగోపాల్ అంటారు. అటువంటి ఆధారాలను కూడా ఈ మేడారం చరిత్ర సందర్భంగా తెలుస్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ ఆదిమ చరిత్రకు ఒక సాధికారత దక్కుతుంది. ఈ చరిత్రను చెక్కించి నిలపెట్టినట్టే ఆధారాలతో సహా చరిత్రను బయట పెడితే ఆ చరిత్ర సాధికారతను మనం నిలబెట్టినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ చరిత్ర ఆ సమూహాల్లోని చాలామంది ప్రజానికానికి తెలియదు. కారణాలు అనేకం. కాబట్టి ఈ చరిత్రను సమగ్రంగా బయటకు తీసుకువచ్చి పరిశోధక విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టైతే భవిష్యత్తులో మరింతగా ఆదిమ జాతుల చరిత్ర వెలికి తీసేందుకు దోహదపడుతుంది.
ఈ చరిత్ర పరిశోధనలో నూతన విషయాలను చూపించినట్లయితే చరిత్రకు అదనపు జోడింపులు మాత్రమే కాదు కొత్త అధ్యాయాన్ని చేర్చినట్టుగా కూడా ఉంటుంది. మేడారం ఉన్న జిల్లాలోనే కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం కూడా ఉన్నది కనుక ఆ విశ్వ విద్యాలయంలోనే ఈ మేడారం చరిత్ర ఆధారంగా మొత్తం ఆదివాసుల చరిత్ర పరిశోధనను వెలికితీసేందుకు కృషి చేసి అందుకు తగ్గ చర్యలు తీసుకున్నట్లయితే ఆదిమ సమాజానికి మరింత మేలు చేసినట్లవుతుంది. అంతేగాక ఆదివాసుల పట్ల ప్రభుత్వానికి గల చిత్తశుద్ధి నిరూపించుకున్నట్లవుద్ధి. చరిత్ర తెలిసిన మేరకు మాత్రమే సత్యం. కాలక్రమంలో దానికి కొత్త తొడుగులు తొడగవచ్చు,కొన్నిటిని తీసేయవచ్చు అవన్నీ కూడా భవిష్యత్తు పరిశోధనలో తేల్చుకోవాల్సిన విషయాలు.
ఇప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి చరిత్రను మాత్రం ఆయా ఆదివాసి సమాజాలతో చర్చించి సాధికారికమైన చరిత్రను బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రభుత్వం మేడారం చరిత్రను విడుదల చేసి దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలి. దీనిద్వారా చాలామంది భవిష్యత్తు తరాలు ఆదివాసులతో సహా సమాజం అంతా గొప్ప చరిత్ర గురించి తెలుసుకునే వీలు కలుగుతుంది. ఈ మేడారంలో నిలబెడుతున్న చరిత్రతో పాటు దానికి సంబంధించిన ఇతర చారిత్రక అంశాలు అన్నిటిని తెలిపే ఒక కార్యక్రమాన్ని ఆదివాసి ఆధునిక తరం కోసం రూపొందిస్తే భవిష్యత్తులో వారు మరింతగా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి దోహదపడుతుంది.మొత్తంగా చూస్తే ” ఆదివాసీ సంస్కృతి, ఆచార వ్యవహారాలు పరాయీకరణకు గురికాబడుతున్న తరుణంలో మేడారంలో నిలబెడుతున్న ఆదిమ తెగల చరిత్ర అస్తిత్వ ప్రకటన మాత్రమే కాదు, ఆధిపత్య సాంస్కృతిక శక్తులకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రతీక కూడా”.
ఇక పోతే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ప్రత్యేకముగా ఒక విషయాన్ని చెప్పాలి. ఏ ఆదివాసుల, మూల వాసుల చరిత్రను తరతరాలకు తెలుపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందో అంతే శ్రద్ధతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసుల హక్కులను అమలు చేయడానికి కృషి చెయ్యాలి. ఐదవ షెడ్యూల్ ఏరియాలో అమలు కావలసిన చట్టాలన్నీ పాలకుల చర్యలవల్ల నిర్వీర్యానికి గురవుతున్నవి. ఆదివాసి ప్రాంతాల్లో స్వయంపాలనకు ప్రతిరూపంగా చెప్పబడే పెసా గ్రామసభలు వారి సహజ వనరులను కాపాడుకోవడానికి కాకుండా పాలకుల ప్రయోజనాలకోసం చేతులెత్తే, బలవంతంగానైన చేతులెత్తించే సభలుగా మారిపోతున్నవి. విద్యా,ఉపాధి రంగాల్లో వారికోసం చేసిన చట్టాలు రద్దు చేయబడుతున్న ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ ఆదివాసి చట్టాల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటేనే మేడారం వంటి అభివృద్ధి చర్యల్లో ఆదివాసుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ నిజమని నమ్మాల్సి వస్తుంది. లేదంటే ఉత్త ప్రాయోజిత కాంక్ష చర్యలుగా చూడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆదివాసీ సమూహాలు, సంఘాలు కూడా ఈ చరిత్రను నిలుపెట్టుకోడానికి ఎంతైతే కృషి చేశారో,పోరాటం చేశారో అంతే పట్టుదలతో తమ హక్కుల సాధనకు, నిర్వీర్యం చేయబడుతున్న హక్కులను పరిరక్షించుకుని అమలు చేయించుకునేందుకు సమ్మక్క సారలమ్మల స్పూర్తిగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
దిలీప్.వి
ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గ సభ్యులు
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్
సెల్:8464030808





