వారు ప్రశ్న కాదు, సమాధానం. ఆయనది ధిక్కారం కాదు, పరిష్కార వైఖరి. నిర్మాణాత్మకంగా పనిచేయడంలో ఎదురీదక తప్పని స్థితిని అడుగడుగునా ఎదుర్కొని సదా చిత్తశుద్దితో ధైర్యసాహసాలతో ప్రజల పక్షం వహించిన యోధుడాయన. వారి ఆత్మకథ తెలంగాణకు దారిదీపం. రేపటి రోజుకు వైతాళికం.
-కందుకూరి రమేష్ బాబు
నేడు నిజంగా శుభదినం. ముచ్చర్ల సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భం తెలంగాణకు శుభ సూచకం. ఈ రోజును ‘ధిక్కార దినం’గా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ ఉద్యమకారుల ఒక గొప్ప స్మారక సభను నిర్వహిస్తున్నందుకు ఎంతో ఆనందం. ఆ మహనీయుడికి ఆలస్యమైనా ఘనంగా నీరాజనాలు అర్పుస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది ముమ్మాటికి శుభ సందర్భం. నేటికీ నిద్రాణంగా ఉన్న మన జాతికి వారి నిశిత వైఖరి నిత్య ప్రేరణ, అది వైతాళికం.
దురదృష్టవశాత్తూ ముచ్చర్ల సత్యనారాయణ గారు మనల్ని విడిచి వెళ్లి పదేళ్ళవుతోంది. ప్రఖ్యాత రచయిత పి. చంద్ గారు తనతో ఎంతోకాలం గడిపి వారి జీవిత చరిత్రను మహత్తరంగా రచించారు. వారి స్మృతిని చిరస్మరణీయం చేశారు. ఆ పుస్తకాన్ని వారి మరణానంతరం 2017లో ‘ధిక్కార కెరటం’ పేరుతో తేవడం విశేషం. ఐతే, ఒక ఆశ్చర్యం. ఒక విభ్రాంతి. ఒక విచారం కూడా.
అవును. ఆ గ్రంధం చదివిన వారు అశ్చర చకితులే అవుతున్నారు. ఎంతో బాధకు లోనవుతున్నారు. తమలో తామే మాట్లాడుకుంటున్నారు. “ఎంత అన్యాయం” అనుకుంటున్నారు. కొందరు ఉండబట్టలేక ‘ఇంతకాలం వీరి గురించి మనకు ఎందుకు తెలియదు?’ అని ప్రశ్నించుకుంటున్నారు. కొందరైతే వ్యాసాలు రచించి తిరిగి వారి ఉనికిని చర్చలోకి తేవడం తమ కర్తవ్యం అని నేడు దృఢంగా నమ్ముతున్నారు. మంచి పరిణామం. చిత్రమేమిటంటే, ఎందుకు అయన ఇంతదాకా మనందరికీ పెద్దగా తెలియలేదూ అని!?
ఊరి పేరునే ఇంటి పేరుగా మలుచుకున్న ముచ్చర్ల సత్యనారాయయణ గారి గురించి ఈ తరానికే కాదు, నిన్నటి తరానికి కూడా పెద్దగా తెలియక పోవడానికి కారణం ఏమిటి? ఎందుకు వారు ప్రజాదరణ పొందలేదు? ఎందుకు తాను తెలంగాణ ఉద్యమకారుల్లో ప్రథమశ్రేణిలో గౌరవం పొందే చరితార్ధుడు కాలేదు? నిజానికి తేలగాణ వైతాళికుల్లో ఒకరిగా నిలవదగ్గ ఆజానుబాహువు వారు. అంతటి భాహుముఖ వ్యక్తిత్వం ఆయనది. కానీ, ఎందుకని అప్రధానం అయ్యారు? సమాధానం ఒకటి కాదు, రెండుగా చెప్పాలి.
అతడు మొదట అచ్చమైన తెలంగాణ ఉద్యమకారుడు. తర్వాత నిఖార్సైన బీసి యోధుడు. ఈ రెండు అస్తిత్వాలకు జంకిన వారి కారణంగానే అతడు ‘అప్రధానం’ అయ్యారు. ఆ సంగతిని తన ఆత్మకథలోని ప్రతి పుటా అజేయంగా చెబుతోంది.
‘ధిక్కార కెరటం’ వారి ఆత్మకథ. ఇది తెలంగాణను దోచుకోవడమే పరమ లక్ష్యంగా ఎంచుకున్న సీమంద్రులకు వ్యతిరేకంగా నిలబడిన తెలంగాణ భూమి పుత్రుడి సమరగాథ. అగ్రకులాల ఆధిపత్యాన్ని అడుగడుగునా నిరసిస్తూ, ఘర్షణ పడుతూ వీరోచితంగా ముందుకు సాగిన వెనుకబడిన కులాల నాయకుడి ఉజ్వల చరిత్ర కూడా. అందుకే వారి జీవితం, ఉద్యమం ప్రముఖం కాలేదు. వారూ మరుగున పడవలసి వచ్చింది.
నిజానికి ఆయన సర్పంచుగా చేశారు. సమితి అధ్యక్షులుగా పని చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రవాణా శాఖకు క్యాబినెట్ మంత్రిగానూ పని చేశారు. తెలంగాణా ఉద్యమ ప్రతి దశలోనూ కవిగా, గాయకుడిగా, వాగ్గేయకారుడిగా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కలం విలువ ఎరిగిన ఆయన పాత్రికేయం, ప్రచురణల అవశ్యకతనూ గుర్తెరిగి పనిచేశారు. పోరాట యోధుడిగా, బహుముఖ ప్రజ్ఞావంతుడిగా ఆయన జీవితకాలం అవిశ్రాంతగా కృషి చేశారు. కానీ, పేరు, ప్రఖ్యాతి, ఆదరణ, గౌరవం చరిత్రలో ప్రముఖ స్థానం ఎందుకు దక్కలేదన్నది నిజంగానే చక్కటి ప్రశ్న. మనసు నొచ్చుకునే గాయం.

తాను అసలు సిసలు తెలంగాణ వ్యక్తి కావడం ఒక కారణం. అచ్చమైన బిసి మనిషిగా నిలబడటం రెండో కారణం. అందువల్లే సంగంరెడ్డి సత్యనారాయణ గారు ఇంటా బయటా ‘ధీక్కారి’గానే వ్యక్తమయ్యారు. కానీ, ఆయన నిర్మాత. కార్యశూరులు. తనకు ఆంధ్రావాళ్ళు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు. తెలంగాణలో చెన్నారెడ్డి మొదలు కేసీఆర్ వంటి అగ్రకుల ‘తెలంగాణ సాధకులు’ రావలసినంత గుర్తింపును దక్కకుండా చేశారు. అప్రదానం చేశారు. ఫలితంగా ఈ యోధుడు కేవలం తిరుగుబాటుకు, ధిక్కారానికి ప్రతీకగా కానవస్తడు. కానీ తనకు గానీ, తన ఆత్మకథకు గానీ అది సరైన శీర్షిక కాదు.
సత్యనారాయణ గారు అచ్చతెలుగు తెలంగాణ వాది. నాయకుడు. ద్రష్ట. ఉత్పత్తి కులాల మేధావి. వారి అవిరళ కృషి, నాయకత్వ ప్రతిభ, అపారమైన సృజన నిరంతరం ఆధిపత్యం వహించే అగ్రకుల నేతలతో పోరాడవలసి రావడంతో, అలాగే –స్వార్థపర సీమాంధ్ర నాయకత్వంతో అడుగడుగనా ఘర్షణ పడుతూ సాగడంతో వారి పేరు, ప్రఖ్యాతి పైపైకి ఎదగడంకన్నా సామాన్య జనంలోకి ఇంకింది. వారిని మరింత నిస్వార్థమైన మనిషిగా నిలిపింది. తనను ప్రజాపక్షంగానే నిలబెట్టింది. కానీ, ప్రధాన స్రవంతిని మలిచే చరిత్రలో వారు లేకుండా పోయారు. వాస్తవానికి అనేక స్వీయానుభావాలతో, ప్రత్యక్ష అనుభవాలతో రాటు దేలిన వారి వ్యక్త్యిత్వం తుది శ్వాస వరకూ న్యాయం కోసం, ధర్మం కోసం స్వజాతి బహుజనుల శ్రేయస్సు కోసం, సుజాత ఐన తెలంగాణా హితం కోసం, అవసరమైన న్య్యాయం కోసం, వేరుగా నిలిచి స్వతంత్రంగా మిగలడం కోసం అసామాన్యంగా పోరాడింది. పోరాడి ఒరిగిన ‘సత్యం’ ఆయన. శివం, సుందరం ఆయన. ఇప్పుడైనా రాయాలి. కీర్తించాలి. వారి చరిత్రను మహోజ్వలంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకు వారి ఆత్మకథ తప్పక చదవాలి.
‘ధిక్కార కెరటం’ పేరిట వెలువడిన ఈ రచనను లోతుగా అధ్యయనం చేయాలి. అది అనేక విధాలా వర్తమాన తెలంగాణకు పాఠ్యాంశం అని చెప్పక తప్పదు. తెలంగాణాలో సీమాంధ్రుల దోపిడి ఎలా ప్రారంభమైనది, అది ఎలా కొనసాగింది, కేసేఆర్ హయాంలోనూ చివరకు నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా అదెలా కొనసాగుతున్నదో అర్థం కావడానికి కూడా ఈ పుస్తకం ఒక గొప్ప గైడ్.
చెన్నారెడ్డి నుంచి కేసేఆర్ దాకా జయశంకర్ సర్ తో సహా వారి వ్యక్తిత్వాలను అందలి లోటుపాట్లను కూడా ముచ్చర్ల సత్యనారాయణ బయటపెట్టారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, వెంగళరావు మాత్రమే కాదు, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు దాకా ఎలా తెలంగాణకు, ఆలాగే -బహుజనులకు వ్యతిరేకంగా వారంతా నిలిచారో వివరించిన గ్రంధం ఇది.
విషాదం ఏమిటంటే, ప్రతి చారిత్రక సందర్భంలో లేచి నిలబడ్డట్టు కన్పించే ‘తెలంగాణ’ గత ఎనిమిది దశాబ్దాలుగా ఎందుకని పదే పదే ఓడిపోతున్నదో ముచ్చర్ల సత్యనారాయణ గారి గ్రంధం నిజంగా ఒక గొప్ప కేస్ స్టడీగా మన కళ్ళు తెరిపిస్తుంది.
ఒకరకంగా ఇది తెలంగాణ జీవిత చరిత్ర. అనేక దశాబ్దాలుగా పీడనలో ఉన్న తెలంగాణ ప్రాతీయ స్వాభావికతను, ఇక్కడి మనుషుల వినిర్మల జీవితాన్ని, అవిరళ కృషిని, నిస్వార్థ సేవాతత్పరతను, అణచివేతను సహించని తత్వాన్ని, ప్రత్యక్ష అనుభవం నుంచి జనించిన ధిక్కారాన్ని అక్షరాలా నిర్మాణాత్మకంగా వెల్లడిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వీయ అస్తిత్వాన్ని కోరుకుంటూ మూడు దఫాలుగా పోరాడిన మెజారిటీ ప్రజల తాలూకు తెలంగాణ ఆత్మకథగా ఈ పుస్తకం విశిష్టమైన దారిదీపంగా నిలుస్తుంది. మరో మాటలో, ఈ పుస్తకం సకల దశల తెలంగాణ అడుగడుగునా ఎలా భంగ పడిందో విశదం చేస్తుంది. అందులో వారూ ఒకడిగా ఉండటం తప్పదు. అనివార్య చరిత్ర వారిది.
ఒక్కతీరు కాదు. తెలంగాణ లేచిన అన్ని దశల్లోనూ ఆయన పనిచేశారు. ముందే చెప్పినట్లు ఇక్కడి భూమి పుత్రుడిగా దిగ్గున లేచి ఆయన నాయకత్వం అందించారు. నలభై దశకంలో తెలంగాణా సాయుధ పోరాట ఛాయలు రజాకార్ల దాడుల పేరుతో ఒరుగల్లును ముంచేత్తడం నుంచి ఆయన ఉద్యమకారుడిగా కానవస్తారు. ఇక, యాభయ్యవ దశకంలో ఇడ్లీ సాంబార్ – నాన్ ముల్కీ ఉద్యమంలో ఆయన నాయకుడే అవుతారు. అరవై చివర్లోని తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పనిచేయడం చూస్తాం. పాట తెలంగాణకు ఎట్లా ఆయువు పట్టో ఆయనే ముందుతరం దూతగా కానవస్తారు. మధ్యలో అనేక పోరాటాల్లో ఆయన నిఖార్సైన వ్యక్త్యిత్వం చూస్తాం. అటు తర్వాత తొంభయ్యవ దశకంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ అరుదెంచడం, జయశంకర్ సార్ ఉదాసీన వైఖరి, సత్యనారాయణ గారి విమర్శనాత్మక ధోరణి, ఇలా మొత్తంగా తనదైన పాత్ర వహిస్తారు. అంతేకాదు, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా ఆశించిన లక్ష్యాలను నేరవేర్చడంలో విఫలమవుతున్న స్వతంత్ర రాష్ట్రం పట్ల కూడా ఆయన కినుక వహించారు. గళమెత్తారు. ఎప్పటికపుడు హెచ్చరిస్తూ వచ్చారు కూడా. ఇవన్నీ ముచ్చర్ల సత్య నారాయణ గారు (1933-2016) చెబుతుంటే చంద్ గారు సుదీర్ఘ జీవిత చరిత్రలో సూటిగా పొందుపరచడం నిజంగా విశేషమే. అది చదవడం నేటి తరం ప్రథమ ప్రాధాన్యం కావాలనే ఈ వ్యాసం. ఘన స్ర్ముతి.
అనుకుంటాం గానీ ‘ధిక్కారం’ వారి వ్యక్తిత్వం అని. కానీ ఆధిపత్యం, అణచివేత, పీడన, దోపిడీలను వారు ఎప్పటికప్పుడు సహించి ఉంటే వారేప్పుడో చరిత్రకెక్కేవారు. ముఖ్యులుగా కీర్తింపబడేవారు. జయశంకర్ సార్ కన్నా ఎక్కువ పేరే వచ్చేది. కానీ ఆయనలా తాను ‘ఏ కుక్క పడితే ఏమిటీ… కుందేలు ముఖ్యం.” అని భావించలేదు. “ముందు తెలంగాణ రానీ…తర్వాత చూసుకుందాం” అని అనుకోలేదు. “నాకేమైనా ఇల్లా… సంసారమా?” అని నిర్లిప్తంగా అనలేదు. తెలంగాణా అందరి ఇల్లు అనుకున్నారు. తక్షణంలోనే భవిశ్వత్తు దాగి ఉంటుందని వీక్షించారు. నిర్లక్ష్యం వహించిన ఎవరినీ ఉపేక్షించ లేదు. అది సరికాదని హెచ్చరించారు కూడా. అందుకే ఆయన ప్రాసంగికత నేటికీ ఉన్నది. వారి జీవిత చరిత్ర తెలంగాణ ఆత్మకథ మాదిరి అయింది. అది ‘చరిత్ర’గా రేపటి తరాన్ని అప్రమత్తం చేయనున్నది. అందుకు నేడు శుభదినం. ఈ ‘ధిక్కార దినం’ స్వీయ రాజకీయ అస్తిత్వ లేమితో నిద్రాణంగా ఉన్న జాతికి, బహుజన ప్రజకు ఉజ్వలమైన ప్రేరణ కావాలి. నిర్మాణాత్మక ప్రతీకగా మిగలాలి.
అటువంటి ఆకాంక్ష దినోత్సవం వారి జన్మదినం. మరి, జై తెలంగాణ.
( వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్. మొబైల్ 9948077893)





